GO 111 lifted: హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల క్యాచ్ మెంట్ ప్రాంతంలోని గ్రామాల్లో 111జీఓ ద్వారా విధించిన ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆంక్షలు ఎత్తివేసిన సర్కార్... జంట జలాశయాల్లో నీటి నాణ్యత దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని షరతు విధించింది. విధివిధానాల రూపకల్పన, సమగ్ర మార్గదర్శకాల కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. తాజా ఉత్తర్వుతో 84 గ్రామాల పరిధిలోని లక్షా 32వేల ఎకరాల పరిధిలో నిర్మాణాలు, ఇతరత్రాలపై ఆంక్షలు తొలగిపోనున్నాయి.
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల క్యాచ్ మెంట్ ప్రాంతంలోని దాదాపు లక్షా 32వేల ఎకరాల విస్తీర్ణంలోని 84 గ్రామాల్లో కాలుష్య కారక పరిశ్రమలు, పెద్ద హోటళ్లు, రెసిడెన్షియల్ కాలనీలు, ఇతర నిర్మాణాలను నిషేధిస్తూ 1996 మార్చ్ ఎనిమిదో తేదీన పురపాలక శాఖ 111 జీఓ జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వు వల్ల విధించిన ఆంక్షల వల్ల తమ ప్రాంతం అభివృద్ధి చెందడం లేదని, భూముల ధరలు పెరగడం లేదని ఆ ప్రాంత వాసులు చాలా ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రస్తావించారు.
దీంతో 111 జీఓను ఎత్తివేస్తామని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 111 జీఓ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా 111 జీఓ పరిధిలోని గ్రామాల్లో ఆంక్షల ఎత్తివేత కోసం ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు 69వ నంబర్ ఉత్తర్వును పురపాలకశాఖ జారీ చేసింది.
111జీఓ జారీ చేసిన సమయంలో హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను రెండు జలాశయాలు 27.59 శాతం తీర్చేవని... రోజుకు 145 మిలియన్ గ్యాలన్ల నుంచి 602 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమైన ప్రస్తుత పరిస్థితుల్లో 1.25 శాతం కంటె తక్కువున్న పరిస్థితుల్లో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఆధారం కాబోదని ప్రభుత్వం పేర్కొంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం... జంట జలాశయాల్లో నీటి నాణ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినరాదని షరతు విధించింది. నీటి నాణ్యత మెరుగుపర్చేందుకు వివిధ ప్రాంతాల్లో ఎస్టీపీలు నిర్మించడం, జలాశయాల్లోకి నీరు వెళ్లేలా డైవర్షన్ ఛానళ్ల నిర్మాణం, భూగర్భ జలాల నాణ్యత పరిరక్షణ, కాలుష్య తీవ్రత తగ్గింపు, తదితర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
తీసుకోవాల్సిన చర్యల కోసం విధివిధానాల రూపకల్పన, సమగ్ర మార్గదర్శకాల కోసం కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పురపాలక, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, పీసీబీ సభ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీకి అంశాలు తొమ్మిది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ గా ఖరారు చేశారు. జంట జలాశయాల పరిరక్షణ - కాలుష్య నిరోధానికి చర్యలు, గ్రీన్ జోన్లు సహా జోన్ల నిర్ధరణ కోసం విధివిధానాలను సిఫారసు చేయాల్సి ఉంటుంది. ట్రంక్ వ్యవస్థ అభివృద్ధి కోసం మార్గదర్శకాలు, రహదార్లు - డ్రైన్లు - ఎస్టీపీలు - డైవర్షన్ డ్రైన్ల నిర్మాణం కోసం నిధుల సమీకరణ మార్గాలను చూపాల్సి ఉంటుంది.
వసతుల కల్పన, నియంత్రిత అభివృద్ధి కోసం వ్యవస్థ ఏర్పాటు, లేఅవుట్ - భవన అనుమతుల కోసం నియంత్రణా చర్యలు సూచించాలి. నియంత్రిత అభివృద్ధి సమర్థంగా జరిగేలా ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చర్యల్లో అవసరమైన మార్పులపై దృష్టి సారించాల్సి ఉంది. జంట జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా చర్యలతో పాటు ప్రాంతంలో మౌలికవసతుల కల్పన కోసం నిధుల సమీకరణ మార్గాలపై కమిటీ దృష్టి సారించాల్సి ఉంది. జంట జలాశయాల్లో నీటి నాణ్యత దెబ్బతినకుండా ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో కమిటీ అవసరమైన విధివిధానాలపై దృష్టి సారించాలన్న ప్రభుత్వం... వీలైనంత త్వరగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: