KONASEEMA: కోనసీమ జిల్లా పేరును.. డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ.. ప్రభుత్వం ఎట్టకేలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం అసాధారణ జాప్యం, ఉదాసీనత ప్రదర్శించింది. ఇన్నాళ్లుగా తుది నోటిఫికేషన్ రాకపోవడంతో.. జిల్లా కలెక్టరేట్ సహా, అన్ని ప్రభుత్వ కార్యాలయాల పేర్లు.. కోనసీమ జిల్లాగానే కొనసాగాయి. జిల్లా అధికారులు ఈ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తూవచ్చారు.
కోనసీమ జిల్లా పేరును.. డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ.. మే 18న ప్రభుత్వం ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. అభ్యంతరాల కోసం నెల రోజుల సమయమిచ్చింది. ఆ ప్రతిపాదనకు జూన్ 24 న రాష్ట్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఆ తర్వాత 40 రోజులకు ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. సాధారణంగా మంత్రి మండలి ఆమోదం తెలిపిన తర్వాత ... వారంలోపే గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. కానీ దానికి భిన్నంగా ఇంత అసాధారణమైన జాప్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.