రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో కళాశాలలు మూతపడడం, ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండడం, ఎవరూ బయటకు రాలేని పరిస్థితుల్లో ఈ అత్యవసర రోగులకు రక్తనిధుల కొరత ఏర్పడింది. రోజుకు కనీసం 150 వరకూ యూనిట్ల్ల రక్తం అవసరమైన పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు రక్తం అందించకపోతే రోగుల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో..
ఉస్మానియా, గాంధీ, సుల్తాన్‌బజార్, కింగ్‌కోఠి తదితర ఆసుపత్రుల్లోని రక్తనిధి కేంద్రాల్లోని సిబ్బందిని ఇక్కడికి సర్దుబాటు చేసింది. వేర్వేరు ఆసుపత్రుల్లో రక్తాన్ని సేకరిస్తుంటే.. రాకపోకల వల్ల ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందే అవకాశాలుంటాయనీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేచోట రక్తాన్ని సేకరించడం శ్రేయస్కరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ యోగితారాణా ఆదేశాలు జారీచేశారు.
ఇకపై రక్తదానం ఇలా..
హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఎవరికి రక్తం అవసరమైనా, దానం చేయాలనుకున్నా ఐపీఎంకు రావాల్సి ఉంటుంది. ఇక్కడి సిబ్బంది రక్తదాతలను ఫోన్ ద్వారా సంప్రదిస్తారు. దాతలు అంగీకరిస్తే.. వైద్యాధికారి ఆమోదముద్ర వేసిన ధ్రువపత్రం వారి వాట్సప్ నెంబరుకు చేరుతుంది. దాన్ని పోలీసులకు చూపించి ఐపీఎంకు చేరుకోవాల్సి ఉంటుంది. తద్వారా రక్తదాతలకు రాకపోకల్లో ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఎక్కువ మంది దాతలుంటే..
ఒకవేళ ఏదైనా ప్రాంతంలో 5 అంతకంటే ఎక్కువ మంది దాతలు రక్తమివ్వడానికి అంగీకరిస్తే సిబ్బంది వారి వద్దకే వెళ్లి రక్తాన్ని సేకరించడానికి వీలుగా రెండు వాహనాలను సమకూర్చామని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ వివరించారు.
ఇవీ చూడండి: ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం అంతకుమించి..