Government Affidavit on Amaravathi Construction:అమరావతి నిర్మాణం పూర్తి చేయకుండా... కాలయాపన చేసేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని న్యాయనిపుణులు ఆరోపించారు. ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పరిశీలిస్తే.. అసలు రాజధాని నిర్మించే ఉద్దేశమే లేనట్లు కనిపిస్తోందన్నారు. 'రాజధానిలో పనులు ప్రారంభించడానికే 8 నెలలు కావాలి. గుత్తేదారులతో మళ్లీ ఒప్పందాలు చేసుకోవడానికి మరికొంత సమయం.. రుణాలు పొందేందుకు ఇంకొంత సమయం.. మొత్తం అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి ఐదేళ్లకు పైనే పడుతోందని ప్రభుత్వం అఫిడవిట్ వేయడంపై న్యాయనిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3వేల కోట్లు రుణం తెచ్చుకునేందుకు సీఆర్డీఏకు ఇచ్చిన గ్యారంటీ ముగిసిందని..దాన్ని పునురుద్ధరించబోతున్నామని తెలపడం మరింత విడ్డూరంగా ఉందని న్యాయనిపుణులు ఎద్దేవా చేశారు. లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వానికి రూ. 3వేల కోట్ల అప్పు తీసుకురావడం పెద్ద విషయమేమీ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పేదాన్ని బట్టి చూస్తే.. పాత గుత్తేదారులకే మళ్లీ పనులు అప్పగించబోతున్నారని తెలుస్తోందన్నారు. అలాంటప్పుడు ఈఓటీ ఆమోదానికి 2 నెలల సమయం ఎందుకు పడుతుందని న్యాయ నిపుణులు ప్రశ్నించారు.
పాత పనులే చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్, సర్వే డిజైన్లకు నాలుగు నెలలు ఎందుకని న్యాయనిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అఫిడవిట్ చూస్తే.. కోర్టు ఆగ్రహానికి గురవకుండా తప్పించుకోవడానికి దాఖలు చేసినట్టుంది తప్ప, రాజధాని పనులు చేపట్టాలన్న ఆలోచన లేనట్టు తేటతెల్లమవుతోందని మండిపడ్డారు. అఫిడవిట్ ద్వారా ప్రభుత్వ కుటిలనీతి బయటపడిందని.. రాజధానిలో పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా లేమన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పకనే చెప్పిందని న్యాయనిపుణులు విమర్శించారు. ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌లో అసలు పసలేదని.. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : High Court: విచారణ జరుగుతుండగా మరో కేసా.. పోలీసులకు హైకోర్టు హెచ్చరిక..!