చదువుకున్న తల్లిదండ్రులు సైతం పిల్లలకు జంక్‌ఫుడ్ ఇవ్వడం ఆందోళన కలిగించే అంశమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఇలాంటి ఆహారం వల్ల చిన్నారులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీరామ చంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ పోషకాహార మాసం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గవర్నర్... దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
ఇవాళ్టి నుంచి పోషకాహార మాసం ప్రారంభమైందని... పోషకాహార ఆవశ్యకతపై మరింత అవగాహన పెంచాలని తమిళిసై కోరారు. పోషకాహార లోపాలు నివారించేందుకు ప్రజలు మరింత చైతన్యవంతులు కావాలని కోరారు. సరైన పోషకాహారంతో మాతా, శిశు మరణాలను చాలా వరకు తగ్గించవచ్చని సూచించారు. మానవ జీవితంలో రోగనిరోధక శక్తి ఎంత కీలకమో కొవిడ్-19 మరోమారు గుర్తు చేసిందని... ప్రజలు రోగనిరోధకశక్తి పెంచుకునేలా ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఆరోగ్యకరమైన కూరగాయలను పండించుకునే అవకాశం ఉన్న చోట కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేసుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఆహార భద్రతతో పాటు పోషకాహార భద్రత కూడా ఉండాలని గవర్నర్ కోరారు.