మాతృభాష తల్లి పాల లాంటిదని గవర్నర్ తమిళిసై అభివర్ణించారు. తల్లి పాలు ఎంత ఉపయోగమో... మాతృ భాష కూడా అంతేనని గవర్నర్ వివరించారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తమిళనాడు తిరుచిరాపల్లికి చెందిన భారతీదశన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్గా గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.
మాతృభాషను ప్రేమించి నేర్చుకోవాలని... అదే సమయంలో వేరే భాషలను గౌరవిస్తూ... నేర్చుకోవాలని సూచించారు. జాతీయ విద్యా విధానం కూడ మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చిందని... మాతృభాషలో ప్రాథమిక విద్య పిల్లల విజ్ఞానానికి, తెలివితేటలకు గట్టి పునాదిగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మాతృభాషను గౌరవించటం, ప్రేమించటం, ప్రోత్సహించటం వంటివి తల్లిని గౌరవించినట్లేనని పేర్కొన్నారు. మాతృభాషకు ప్రత్యామ్నాయం లేదని... కొందరు యువత అటు మాతృభాష, ఇటు ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడలేకపోవటం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు.