రక్షణ శాఖ పరిశోధన, తయారీలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానముంది. డీఆర్డీవో, డీఆర్డీఎల్, బీడీఎల్, మిథాని లాంటి సంస్థలు ఇక్కడున్నాయి. ఇందులో బీడీఎల్ది ప్రత్యేక స్థానం. బీడీఎల్ భారత సైన్యానికి అవసరమైన ఏటీజీఎమ్, ఆకాశ్, అస్త్ర, పృథ్వీ, మిలాన్ వంటి ఎన్నో క్షిపణులను అందించింది. 1989లో పటాన్ చెరులో మరో యూనిట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా రక్షణ శాఖకు పరికరాలను అందిస్తూ వచ్చింది. విశాఖపట్నం యూనిట్ నుంచి భారత నేవీకి అవసరమయ్యే టార్పెడోలను తయారు చేస్తోంది బీడీఎల్.
అప్పుడు దిగుమతి... ఇప్పుడు ఎగుమతి
సంస్థ ఏర్పడి 50 ఏళ్లవుతున్న సందర్భంగా.. బీడీఎల్ సీఎండీ సిద్ధార్థ్ మిశ్రా భవిష్యత్ కార్యకలాపాలను ప్రకటించారు. ప్రస్తుతం త్రివిధదళాలకు కావాల్సిన అన్ని రకాల రక్షణ శాఖ పరికరాలను తయారు చేసి ఇవ్వడమే కాక విదేశాలకు కూడా క్షిపణులను ఎగుమతి చేస్తున్నామని మిశ్రా తెలిపారు. మొదటిసారిగా నాలుగు రకాల ఏటీజీఎమ్ మిసైల్స్‌ను ఎగుమతి చేస్తోన్నామని చెప్పారు. గతంలో భారత దేశరక్షణ రంగానికి కావాల్సిన పరికరాలను విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునేదని... ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు.
రూ.8 వేల కోట్ల ఆర్డర్లు
ప్రస్తుతం బీడీఎల్‌కు రక్షణ శాఖ నుంచి రూ.8 వేల కోట్లు విలువ చేసే ఆర్డర్లు ఉన్నాయని.. వీటిని 2023 సంవత్సరం వరకు అందిస్తామని బీడీఎస్ సీఎండీ అన్నారు. వచ్చే ఐదేళ్లలో 25 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆర్డర్లు రానున్నాయని తెలిపారు. 2018-19 ఆర్థిక ఏడాదికి 3 వేల 69కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించామన్నారు.
గ్రామాల దత్తత
మహారాష్ట్రలో మరో యూనిట్ ఏర్పాటుకు బీడీఎల్ సిద్ధమైంది. హైదరాబాద్ ఐఐఐటీతో ఎంఓయూ కుదుర్చుకుంది. రక్షణ శాఖకు చెందిన అంకుర సంస్థలతో పని చేయడానికి త్వరలో టీహబ్‌తో కూడా ఒప్పందం చేసుకోనుంది. తమ రీసెర్చ్‌కు సంబంధించిన సమాచారం భద్రంగా ఉందని సీఎండీ తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 16 కోట్ల రూపాయలతో కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్న బీడీఎల్ వాటి అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతోంది.
- ఇదీ చూడండి : ముంబయిలో భవనం కూలి ఏడుగురు మృతి