రాష్ట్రం నుంచి ఎయిర్ కార్గో ద్వారా వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి కలిసి జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌కార్గో, తెలంగాణ సర్కారు నిర్ణయించాయి. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో "ఎయిర్ కార్గో ద్వారా తెలంగాణ నుంచి వ్యవసాయ ఎగుమతులను పెంచడం" అనే అంశంపై సదస్సు జరిగింది.
ఎయిర్ కార్గో ద్వారా రాష్ట్రం నుంచి వ్యవసాయ ఎగుమతుల వృద్ధికి దోహదపడే వ్యూహాల రూపకల్పనపై విస్తృతంగా చర్చించారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పలు కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో... మామిడి ఎగుమతుల కోసం సదుపాయాలను అన్వేషిస్తోంది. శంషాబాద్ సమీపంలో అగ్రి ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
జీహెచ్‌సీఏ అనేది దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ - మంచి నిల్వ, పంపిణీ పద్ధతుల సర్టిఫైడ్ ప్రధాన కేంద్రం. టెంపరేచర్ సెన్సిటివ్ కార్గో నిర్వహణ, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆటంకాలూ లేకుండా రవాణా చేయడానికి ఇది చాలా అవసరం. పెరిషబుల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, వివిధ తాత్కాలిక, నియంత్రిత ఔషధాలకు అవసరమైన ప్రత్యేక సదుపాయాల కోసం జీహెచ్‌సీఏ తన సేవలు విస్తరింపజేస్తోంది. ల్యాండ్‌సైడ్, ఎయిర్‌సైడ్‌లో ప్రక్రియలు క్రమబద్ధీకరిస్తోంది. ఆ దిశగా హైదరాబాద్ కార్గో ఇప్పటికే ఒక పెద్ద, కస్టమ్ బిల్ట్ కూల్ డాలీని ప్రారంభించింది. ఇది ఎయిర్‌సైడ్ రవాణా కోసం మొబైల్ రిఫ్రిజిరేటెడ్ యూనిట్. హైదరాబాద్ కార్గోలో నిర్వహించబడే ప్రధాన ఎగుమతి, దిగుమతి వస్తువుల్లో వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు వంటి పెరిషబుల్స్, ఔషధాలు, ఇంజినీరింగ్, ఏరోస్పేస్ వస్తువులు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయని ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ జీఎంఆర్ సీఈఓ ప్రదీప్ ఫణికర్, హైదరాబాద్ ఎయిర్‌కార్గో జీఎంఆర్ సీఈఓ సౌరబ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ కస్టమ్స్, ఎయిర్ లైన్స్ సీనియర్ అధికారులు, ఎగుమతిదారులు, సరుకు రవాణాదారులు, ఇతర భాగస్వామ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.