Gangula kamalakar fires on Nirmala Sitharaman: రేషన్ బియ్యానికి సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తప్పు బట్టారు. తెలంగాణలో 90.34 లక్షల కార్డులుంటే అందులో కేవలం 59 శాతం కార్డులకు మాత్రమే.. అదీ ఒక్కరికి ఐదు కిలోల బియ్యాన్ని కేంద్రం అందిస్తున్న విషయం నిర్మలా సీతారామన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రం పట్టించుకోని ఆకలితో అలమటిస్తున్న 95 లక్షల మందికి.. ప్రతి కిలోపై 33 రూపాయలు వెచ్చించి ఎలాంటి పరిమితులు లేకుండా ఇంట్లోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కడుపునిండా అన్నం పెడుతుందని పేర్కొన్నారు.
కరోనా సంక్షోభంలో ఐదు కిలోలు ఉచిత రేషన్ అని చేతులు దులుపుకున్న కేంద్రం ఎక్కడా అని ప్రశ్నించారు. అదనపు బియ్యానికి రూ. 3,862కోట్లు ఖర్చు చేశామని మంత్రి గంగుల తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో కనీసం సరితూగగలరా అని ఆయన ధ్వజమెత్తారు. నిర్మలా సీతారామన్‌కు నిరుపేదలు కనిపించడం లేదా అన్న ఆయన... వారి కడుపు మాడ్చుతున్నది ఎవరని అన్నారు. ఓ వైపు మా వడ్లు కొనమంటూ... ఇప్పుడు మేము మా ప్రజలకిచ్చే బియ్యంపై పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. చరిత్రలో రేషన్ షాపుల్లో ప్రధాని ఫోటోలు ఉన్నాయా అన్న ఆయన... ఇది పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ఠ కాదా అని ప్రశ్నించారు.
ఉచితాలు వద్దనేది భాజపా విధానం అయితే, సంక్షేమంపై వెనక్కి తగ్గరాదనేది తెరాస విధానమని గంగుల వివరించారు. కలెక్టర్ జిల్లా కార్యనిర్వాహణాధికారి.. ఒక శాఖకు మాత్రమే పనిచేయడని తెలియదా అని ప్రశ్నించారు. అధికారులపై అంత దురుసు ఎందుకని అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ జిల్లా కార్యనిర్వాహణాధికారి అనే విషయం మరిచి కేవలం ఒక శాఖ కోసం మాత్రమే పనిచేయడన్న కనీస అవగాహన లేకుండా అధికారుల పట్ల కేంద్ర మంత్రి కనీస మర్యాద పాటించకపోవడం అన్యాయమని ఆక్షేపించారు. ఇది ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీయడమే అని అన్నారు.
ఇవీ చదవండి: