రాష్ట్రవ్యాప్తంగా సోమవారమూ గణేశ్ నిమజ్జనాలు(Ganesh idols immersion at Telangana) ఘనంగా జరిగాయి. నృత్యాలు, కేరింతల మధ్య బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి సాగనంపారు. హైదరాబాద్‌లో విజయవంతంగా నిమజ్జనం కార్యక్రమం ముగిసింది. ఓ వైపు నిమజ్జనం జరుగుతుండగానే వ్యర్థాలు తొలగింపు ప్రక్రియ చేపట్టినట్లు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ప్రకటించారు.
అప్పటికప్పుడు వ్యర్థాలు తొలగింపు..
నిమజ్జనం అనంతరం 10 వేల మెట్రిక్ టన్నులు వ్యర్థాలను తొలగించినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. చెరువులు, కొలనుల్లో వేసిన 83,186 విగ్రహాలు తీసివేశామని వివరించారు. శోభయాత్ర జరిగిన 303 కిలోమీటర్ల మేర చెత్తను తొలగించామన్నారు. రాత్రింబవళ్లు 215 యాక్షన్ బృందాలు, 8,116 మంది పారిశుధ్య కార్మికులు శ్రమించారని వెల్లడించారు. వ్యర్థాల తొలగింపు తర్వాత దోమల నివారణకు గంబుసియా చేపలను వదిలామని చెప్పారు.
భారీ వర్టంలోనూ శోభయాత్ర..
జిల్లాల్లోనూ సోమవారం గణేశ్ నిమజ్జనం ఉత్సాహంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. పాటలు పాడి భక్తులను అలరించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో పది నుంచి పదిహేను అడుగులకుపైగా ఎత్తున్న విగ్రహాలను నిమజ్జనం చేశారు. మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చిన డోలు కళాకారుల నృత్యాల నడుమ శోభాయాత్ర వైభవంగా జరిగింది. నిర్మల్‌లో పట్టణ పురవీధుల గుండా పార్వతి తనయుడిని ఊరేగించారు. భారీ వర్షంలోనూ వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చారు.
పోలీసులకు ప్రశంసలు..
హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియను (ganesh idols immersion at hyderabad) విజయవంతంగా పూర్తి చేసిన పోలీస్ శాఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. డీజీపీ, సహా ఉన్నతాధికారులు, సిబ్బంది పనితీరు అభినందనీయమన్నారు. ప్రజల మనోభావాలు, సంప్రదాయాల ప్రకారం నిమజ్జనం చేయడం సంతోషకరమన్నారు. నిమజ్జన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ (GHMC), పోలీసు, సహా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని మంత్రి తలసాని అభినందించారు.
ఇదీచూడండి: CM KCR statue for sale: నాడు గుడికట్టి పూజలు చేశాడు.. నేడు అమ్మేస్తున్నాడు.. ఎందుకంటే..!