ఆరోగ్యశ్రీ సేవల నిలుపుదలతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. ఉదయం నుంచే ఓపీ విభాగం రోగులతో నిండిపోయింది. ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం వల్ల ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రోగులు తెలిపారు. గాంధీలో వైద్యులు తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరతతో సమస్యలు
గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతిరోజు 4 వేల మంది రోగులు వస్తుండగా ఈరోజు ఆరువేలకు చేరిందని తెలిపారు. నర్సుల కొరత ఎక్కువగా ఉందని, కొన్ని విభాగాల్లో వైద్యులు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. టీచింగ్ హాస్పిటల్స్, ప్రైమరీ సెంటర్లలో ఉన్న వారిని ఆస్పత్రికి బదలాయిస్తే కొంత భారం తగ్గుతుందని పేర్కొన్నారు.
అన్నింటికీ గాంధీయే
జిల్లాల్లో ఉన్న ఆస్పత్రుల్లో టీచింగ్, ఈఎస్ఐసీ, బస్తీ దవాఖానల్లో సిబ్బందిని పెంచితే గాంధీ ఆస్పత్రికి వచ్చే అవసరం తగ్గుతుందని సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. చిన్నచిన్న వాటికి కూడా గాంధీకి రావడం వల్ల తమకు భారంగా మారిందని చెప్పారు.
- ఇదీ చూడండి : 71గొర్రెలకు భార్యను ప్రియునికి అమ్మేసి మోసపోయాడు!