Police Recruitment in Telangana : పోలీస్ కొలువుల సాధనకు యువతను సన్నద్ధం చేసే దిశగా కసరత్తు మొదలైంది. తెలంగాణ పోలీస్‌శాఖ ఉచిత శిక్షణ శిబిరాల ఏర్పాటులో నిమగ్నమైంది. ఎక్కడికక్కడే దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ప్రాథమికంగా అర్హత సాధించిన యువతకు 90 రోజులు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హోంశాఖ పరిధిలోని ఉద్యోగాలకు దేహదారుఢ్యం అవశ్యం కావడంతో జిల్లాల్లోని పోలీస్ శిక్షణ కేంద్రాల మైదానాలను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక హోంశాఖ ఆధ్వర్యంలో 2015లో 9281, 2018లో 18,143 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా.. ఈసారి అంతకన్నా ఎక్కువగా 18,334 పోస్టులను భర్తీ చేయనున్నారు. గతంలో మాదిరిగానే యువతకు ఉచిత శిక్షణ శిబిరాల్ని ఏర్పాటు చేయాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఇప్పటికే అన్ని యూనిట్ల పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఆసక్తిగల యువత నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ మొదలైంది. కిందటిసారి హోంశాఖలో కొలువుల భర్తీ నోటిఫికేషన్‌కు ఏకంగా 6 లక్షలకుపైగా దరఖాస్తులొచ్చాయి. ఈక్రమంలో వీలైనంత ఎక్కువమందికి పోలీస్‌శాఖ తరఫున శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
మహిళల వసతిపై దృష్టి : మొత్తం పోస్టుల్లో 95 శాతానికి పైగా కానిస్టేబుల్ కొలువులే. కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చాక ఈఉద్యోగాల భర్తీ ఇదే తొలిసారి. ఈ వ్యవస్థలో కానిస్టేబుల్ పోస్టులన్నీ జిల్లా కేడర్‌కు చెందినవే కావడంతో యూనిట్ల వారీగా పోటాపోటీగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి మహిళా ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వారికి సురక్షితమైన వసతి ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. ‘‘శిక్షణకు వచ్చే మహిళలకు భద్రతతో కూడిన వసతి ఉంటుంది. ఎక్కువగా డీటీసీల్లోనే శిక్షణ ఇస్తారు కాబట్టి సురక్షిత వాతావరణం ఉంటుంది’’ అని నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.
ఎక్కువమంది బయట కోచింగ్ కన్నా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో లభించే శిక్షణకే మొగ్గు చూపుతున్నారు. దీంతో దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన అనంతరం రెండు విడతల్లో అభ్యర్థుల్ని వడబోసి ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుదారుల శారీరక కొలతలు ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే పరిగణనలోకి తీసుకోనున్నారు. అనంతరం రాతపరీక్షతో పాటు 100 మీటర్ల పరుగులాంటి ప్రాథమిక ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల్ని నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ‘‘ఇప్పటికే ఆన్‌లైన్ లింకులతో పాటు స్టేషన్ల వారీగా నేరుగా దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాం. వీటిని వడబోసి.. ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తాం’’ అని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
ఒక్కొక్కరికి రూ.10 వేలకు పైనే వ్యయం : పోలీస్ కొలువులకు శిక్షణ ఇవ్వడంలో రాతపరీక్షతో పాటు దేహదారుఢ్య పరీక్షలు కీలకం కావడంతో ఒక్కో అభ్యర్థికి భారీగా ఖర్చవ్వనుంది. గతంలో చాలా యూనిట్లలో అభ్యర్థులకు శిక్షణతో పాటు ఉచితంగానే స్టడీ మెటీరియల్, వసతి, భోజన సదుపాయం సమకూర్చారు. శిక్షకులకు పారితోషికమూ ఇవ్వాల్సి ఉండటంతో ఒక్కో అభ్యర్థికి రూ.10 వేలవరకు వ్యయమైంది. ఈసారి అంతకంటే ఎక్కువే భరించాల్సి వస్తుందని అంచనా. అప్పట్లో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం లభించినా ప్రస్తుతం స్పష్టత రాలేదు. అయితే ఈసారి వ్యయం భరించేందుకు చాలాచోట్ల శాసనసభ్యులు ఆసక్తి చూపుతుండటం సానుకూలాంశం.