రాష్ట్రంలో ప్రస్తుతం ఐదుజిల్లాలకు.. పూర్తిస్థాయి కలెక్టర్లులేరు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శర్మన్ పదవీ విరమణ చేయగా ఆ స్థానంలో ఇతరులు ఎవరినీ నియమించలేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు... అదనపు బాధ్యతలు అప్పగించారు. నెలరోజులుగా ఆయనే హైదరాబాద్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజధాని పక్కనే ఉన్న మరో జిల్లా... మేడ్చెల్ - మల్కాజ్ గిరిది అదే పరిస్థితి. వాసం వెంకటేశ్వర్లను బదిలీచేసినప్పటి నుంచి జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్‌ను నియమించకపోవడం వల్ల ఇన్‌ఛార్జిలతోనే నెట్టుకొస్తున్నారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా గతంలో పనిచేసిన... శ్వేతా మొహంతి కొన్నాళ్లపాటు మేడ్చెల్ కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించగా ఆ తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్‌కి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంటే ఏడాదిన్నరగా... జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్ లేరనే చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా ప్రశాంత్‌జీవన్ పాటిల్... సిద్దిపేటకు బదిలీ అయ్యాక కొత్త వారిని ఎవరినీ నియమించలేదు. జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మకే... అదనపు బాధ్యతలు అప్పగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఎంవీ రెడ్డి పదవీవిరమణ చేశాక.. ఆస్థానంలో ఎవరినీ కలెక్టర్‌గా నియమించలేదు. స్థానికసంస్థల అదనపు కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌కే జిల్లా కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. జోగులాంబ గద్వాల జిల్లా పాలనాధికారిగా పనిచేసిన క్రాంతి సెలవుపై వెళ్లగా అదనపు కలెక్టర్ కోయ శ్రీహర్షకే పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్రంలో ఐదు జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లు లేకపోవడం వల్ల... పాలనపై ప్రభావం చూపుతోందని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. ఇటీవల భారీ వర్షాలు, వరదల వేళ అధికార యంత్రాంగం ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకం. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో... భద్రాచలం వద్ద చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పెద్దఎత్తున సహాయ, పునరావాస చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఐతే పూర్తిస్థాయి కలెక్టర్లు లేకపోవడంతో సహాయ, పునరావాస చర్యల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి కురిసిన వర్షాలు, మూసీవరదతో... హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. డెంగీ, మలేరియా సహా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజలను అప్రమత్తం చేసే దిశగా... యంత్రాంగానికి దిశానిర్ధేశం చేశారు. హైదరాబాద్, మేడ్చెల్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో... కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మొహంతిని... హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలకు ప్రత్యేకాధికారిగా నియమించారు. పూర్తి స్థాయి కలెక్టర్లు ఉంటే క్షేత్రస్థాయిలో బాగుంటుందని... వర్షాలు, వరదలు, విపత్తులతో పాటు సీజనల్ వ్యాధులు సహా ఇతర సందర్భాల్లో ఇంకా ఎక్కువ అవసరమని అధికార యంత్రాంగంలో చర్చ జరుగుతోంది.
ఇవీ చదవండి: