హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ చట్టాల బిల్లులపై రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల బిల్లు-2020, దాని పర్యవసానాలపై విస్తృత చర్చ జరిగింది. రెవెన్యూ పాలనలో పారదర్శకత, అవినీతి, అక్రమాలకు తావులేకుండా సత్వర సేవలు అందించే లక్ష్యంతో... ఈ నెల 9న శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా... రెండు రోజుల తర్వాత విస్తృత చర్చ అనంతరం సభ ఆమోదించింది. ఆ తర్వాతే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఇటీవల కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించిన రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయాల కల్పన), ధరల హామీ - వ్యవసాయ సేవల బిల్లు (సాధికారత, రక్షణ), నిత్యావసర వస్తువుల (సవరణ) తదితర బిల్లులపై సమావేశం సర్వత్రా నిరసనకు వేదికైంది. ఆ బిల్లుల్లో అసలేముంది? పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు ఎందుకు భగ్గుమంటున్నారు? వ్యవసాయ స్వరూపం మారిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతోన్నాయి. రాష్ట్రంలో కూడా కొత్త రెవెన్యూ చట్టం, కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో విస్తృతంగా చర్చించడం ద్వారా బిల్లులోని సారాంశం ప్రజల్లోకి తీసుకెళ్లి బిల్లులకు వ్యతిరేకంగా ఈ నెల 25న జరిగే భారత్ బంద్ విజయవంతం చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
చిన్న, సన్నకారు రైతులకు కష్టమే..
ఒక్క రిజిస్ట్రేషన్‌లో మార్పులు చేసినంత మాత్రాన రెవెన్యూ సమస్యకు పరిష్కారం కాదు. వారసత్వ చట్టాలకు ఛార్జీలు వసూళ్ళు చేయడం, రికార్డులు మార్పులు చేసిన వారిపై కేసులు పెట్టకపోవడం సరైన విధానం కాదు. రాష్ట్రంలో ఉన్న మొత్తం సాగుభూమిపై వాస్తవ సాగుదారులకు హక్కులకల్పనకు అనుగుణంగా రెవెన్యూ చట్టంలో మార్పులు తేవాలన్నది రైతు సంఘాల డిమాండ్. 1786లో ఆంగ్లేయులు శిస్తుల వసూళ్లకు ఏర్పాటైన రెవెన్యూ, పోలీసు వ్యవస్థలకు నేటి పరిస్థితులకు అనుగుణంగా ఇతర బాధ్యతలు అప్పగించినప్పటికీ గత చట్టాలే అమలవుతున్నాయి. రాష్ట్రం చేసిన చట్టాలపైనే అందుకు భిన్నంగా కేంద్రం చట్టాలు చేయడం జరిగింది. కేంద్రం చేసిన 2013 భూసేకరణ చట్టానికి రాష్ట్రం 2017లో సవరణ చట్టం తెచ్చింది. రాష్ట్ర జాబితాలో ఉన్న విత్తన చట్టం తేవడానికి ఊగిసలాడుతోంది. అక్రమాలకు ఉపయోగపడేలా ప్రతి చట్టానికి లోపాలు ఉన్నాయి. తాజా కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఎవరైనా మోసపూరితంగా పట్టా పొందితే... సదరు తహశీల్దార్‌ను బర్తరఫ్ చేసి క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. తర్వాత బాధితుడు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలంటే అంత స్థోమత, విజ్ఞానం ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన చట్టం... రైతుల ముసుగులో భూస్వాములకు ఉపయోపడేలా ఉందని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
సమగ్ర భూసర్వే తర్వాతే..
రాష్ట్రంలో 163 లక్షల ఎకరాల సాగుభూములున్నాయి. ఇందులో రైతుల ప్రైవేటు భూములు 147.50 లక్షల ఎకరాలు. 59.94 లక్షలమంది రైతులు ఈ భూములపై హక్కులు కలిగి ఉన్నారు. మిగిలిన 15.50 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ, భూదాన, చెరువులు, బంజర్లు, ఆబాదీ, దేవాదాయ, ధర్మాదాయ, వక్ఫ్, అటవీ, బంజర భూములు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములన్నీ రైతుల సాగులో ఉన్నందున పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. ఇందులో చాలా భూములు ఆక్రమణల్లో కొనసాగుతున్నాయి. అవన్నీ కూడ రాజకీయ పలుకుబడి ఉన్న నేతలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులే ఆక్రమించుకున్నారు. చివరకు నీటిపారుదల వనరులను కూడా ప్రైవేటు ఆస్తులుగా పరిగణిస్తుండటం గమనార్హం. మారిన పరిస్థితుల నేపథ్యంలో... అంతా ఫామ్‌హౌజ్‌ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా భూముల సేకరణకు మొగ్గుచూపుతున్నారు. కారుచౌకగా చిన్న, సన్నకారు, పేద రైతుల నుంచి భూములు కొనుగోలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. రెవెన్యూ, అటవీభూముల సరిహద్దు సమస్యలు తొలగించి సమగ్ర భూ సర్వే చేసిన తర్వాతే కొత్తగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని, ప్రభుత్వ భూములు కాపాడాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కార్పోరేట్లకు అప్పగించేందుకే..
కొత్త రెవెన్యూ చట్టంలో కొన్ని అంశాలు తప్ప... మిగతావన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. త్వరలో భూములకు సంబంధించి ప్రతి అంగుళం సమగ్రంగా సర్వే చేస్తామన్న సీఎం... కాలపరిమితి పెట్టుకొని ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ధరణి పోర్టల్‌లో పొందుపరచాలని సమావేశం డిమాండ్ చేసింది. వ్యవసాయంలో సంస్కరణల పేరిట రాష్ట్రంలో చిన్న రైతుల భూములు కార్పోరేట్లకు అప్పగించి కౌలు రైతులను వెట్టిచాకిరి చేయించేందుకు సర్కార్లు సిద్ధమవుతున్నాయన్న ఆందోళన నెలకొంది.
ఇదీ చూడండి : 'రాష్ట్రాల హక్కులను హరించేలా కొత్త వ్యవసాయ చట్టం'