ఎస్సీల ఓట్ల కోసమే దళితబంధు అమలుచేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్‌కు దళితులపై ప్రేమ లేదని.. వారి ఓట్లపై ప్రేముందని ఈటల విమర్శంచారు. తన రాజీనామా వల్ల హుజూరాబాద్ ప్రజలకు లాభం కలుగుతోందన్న ఈటల.. అందరికీ పింఛన్లూ వస్తున్నాయన్నారు. హుజూరాబాద్ ప్రజలకిచ్చే వరాలు రాష్ట్రమంతా ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. సీఎంవోలో దళిత అధికారికి పోస్టింగ్ ఇచ్చినట్లుగానే.. బీసీ, ఎస్టీ, మైనార్టీ అధికారులకు చోటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఏ విధంగా అందరికీ రూ.10 లక్షల రూపాయిలు ఇచ్చారో.. అదే మాదిరిగా రాష్ట్రంలోని అర్హులందరికీ ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్పై విశ్వాసం సన్నగిల్లిందని.. ఇక తెరాసకు భవిష్యత్ లేదని ఈటల విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపుఖాయమైందని.. తెరాసకు డిపాజిట్లు రావని రాజేందర్ చెప్పారు.
'నా రాజీనామాతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు వస్తున్నాయి. నా డిమాండ్ల ఫలితంగానే దళిత అధికారులకు మంచి పోస్టింగ్‌లు వచ్చాయి. కేసీఆర్ ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్‌కు విశ్వసనీయతలేదని సర్వే చెప్పింది. ఓట్ల కోసమే దళితబంధు పెట్టారని లబ్ధిదారులకు కూడా తెలుసు. కేసీఆర్ ఎన్ని లక్షలు ఇచ్చినా నాకే ఓటేస్తామని ఎస్సీలు అంటున్నారు. నాదే గెలుపని కేసీఆర్ చేయించుకున్న సర్వేలే చెప్పాయి.'
-ఈటల రాజేందర్, మాజీ మంత్రి
ఇదీచూడండి: KTR: 'హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచినా... ఓడినా ఏం మారదు'