గత అక్టోబరులో వచ్చిన వరద మిగిల్చిన విషాదం మరువక మునుపే.. మరోసారి మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి కురిసిన వానకు హైదరాబాద్‌లోని నాలాలు, చెరువులు పొంగి కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరవడంతో అర్ధరాత్రి ఏం చేయాలో తెలియక.. బాధితులు నానాకష్టాలు అనుభవించారు. కొందరు ఇళ్లపైకి చేరుకుని వానలో తడుస్తూనో.. మరికొందరు సమీపంలోని ఇళ్లల్లో పైఅంతస్తుల్లోకి వెళ్లి చలిలో వణుకుతూనో.. ప్రాణాలు కాపాడుకున్నారు. బండ్లగూడ అయ్యప్పకాలనీలో రైస్ ఏటీఎం సంస్థ ప్రతినిధులు బిస్కెట్లు, పాలప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఇదీ పరిస్థితి..
- అమీర్‌పేట పరిధిలోని మంత్రాల చెరువు, సందెచెరువు, పెద్దచెరువు పొంగుతున్నాయి. ఈ ప్రభావంతో మిథిలానగర్, ప్రశాంతినగర్, ఎంఎల్‌ఆర్‌కాలనీ, అయోధ్యనగర్, సత్యసాయినగర్, టీఎస్‌ఆర్‌నగర్, ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీ, సాయిబాలాజీనగర్, శివసాయికాలనీ, లెనిన్‌నగర్ ముంపు బారిన పడ్డాయి.
- హయత్‌నగర్‌లోని నాలాలు పొంగడంతో అంబేడ్కర్‌బస్తీ, రంగనాయకులగుట్ట, పద్మావతికాలనీలు నీట మునిగాయి.
- జల్‌పల్లి బురాన్‌ఖాన్ చెరువు పొంగడంతో ఉస్మాన్‌నగర్‌లో ఇళ్లు ముంపునకు గురయ్యాయి.
- దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని కోదండరామనగర్, సీసల బస్తీ, శారదానగర్, కమలానగర్, వీవీనగర్‌లోని అపార్టుమెంట్ల సెల్లార్లలో నీరు చేరింది. బండ్లగూడ చెరువులోకి వెళ్లాల్సిన నీరు అయ్యప్పకాలనీ, మల్లికార్జుననగర్‌ను ముంచెత్తింది.
- వనస్థలిపురం పరిధిలోని హరిహరపురం, సామనగర్, స్నేహమయినగర్, గాంధీనగర్, క్రిస్టియన్ కాలనీ, కృష్ణానగర్, గుంటిజంగయ్యనగర్, ఆగమయ్యనగర్, సహారాఎస్టేట్ వరద ముంపునకు గురయ్యాయి.
- రామంతాపూర్, వివేక్‌నగర్, ప్రగతినగర్, ఇంద్రానగర్, నేతాజీనగర్, శాంతినగర్, భవానీనగర్, భరత్‌నగర్ చిలుకానగర్‌లో హనుమాన్‌నగర్, న్యూభరత్‌నగర్, రాఘవేంద్రనగర్ కాలనీలు ముంపు బారిన పడ్డాయి.
నగరంలో గతేడాది అత్యధిక వర్షపాతాలు..
గతేడాది అక్టోబరు 14న ఘట్‌కేసర్ సింగపూర్ టౌన్‌షిప్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 32.4 సెం.మీ., హయత్‌నగర్‌లో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సౌత్ హస్తినాపురంలో 28.8 సెం.మీ., కీసరలో 26.5 సెం.మీ., సరూర్‌నగర్‌లో 27.5 సెం.మీ నమోదైంది.
అదేరోజున ముషీరాబాద్‌లో 25.9 సెం.మీ. వాన పడింది. ఉప్పల్ రాజీవ్‌నగర్‌లో 25.7 సెం.మీ., సైదాబాద్‌లో 25.2 సెం.మీ, బండ్లగూడలో 24.8 సెం.మీ.కురిసింది.
చూస్తుండగానే నడుములోతు నీళ్లు
గతేడాది వానలకు ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. అప్పట్లో ఇల్లు ఖాళీ చేసి అద్దె ఇంట్లో ఉన్నాం. మళ్లీ ఈ ఏడాది జనవరిలోనే ఇంటిని బాగు చేయించుకుని తిరిగి వచ్చాం. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా రోడ్లు మునిగిపోయి ఇంట్లోకి నీళ్లు రావడం ప్రారంభమయ్యాయి. చూస్తుండగానే నడుములోతు నీళ్లు చేరాయి. కట్టుబట్టలతో ఎదురింట్లో పైఅంతస్తులోకి వెళ్లి తలదాచుకున్నాం.
తిరుపతమ్మ, అయ్యప్పకాలనీ
ఇక మిథిలానగర్‌లో మనుగడ సాగించలేం
మీర్‌పేట: ముప్పై ఏళ్లుగా మిథిలానగర్‌లో ఉంటూ ప్రతి వర్షాకాలంలో ఆర్నెళ్లపాటు వరదలో మునిగిన ఇంటిలో గడుపుతున్నాం. కాలనీ అభివృద్ధి కోసం ఇక్కడ గుడి నిర్మించాం. వరద సమస్య పరిష్కరించాలని ఏళ్ల తరబడి విజ్ఞప్తులు చేశాం. కాలనీ ఇబ్బందులను ఎవరూ పట్టించుకునే పరిస్థితులు కనిపించడంలేదు. ఈ ప్రాంతాన్ని విడిచి మరో చోటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం.
- వేంకటేశ్వరరావు, కాలనీ అధ్యక్షులు, మిథిలానగర్, మీర్‌పేట
వాన నీటి నిర్వహణతోనే వరదకు పరిష్కారం
హైదరాబాద్‌లో తరచూ తలెత్తుతున్న వరద సమస్యకు వర్షపు నీటి సరైన నిర్వహణ ఒక్కటే పరిష్కారమని జేఎన్‌టీయూ సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ విభాగం అధిపతి డాక్టర్ ఎన్వీఎస్‌ఎస్ గిరిధర్ అభిప్రాయపడ్డారు. డాక్టర్ కేఎల్ రావు 120వ జయంతి సందర్భంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (ఐఈఐ) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడికక్కడ వర్షపునీటి నిర్వహణ చేపడితే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.
2004- 2020 మధ్య అతి భారీ వర్షపాతం నమోదైన ప్రాంతాలు
హైదరాబాద్ 36
రంగారెడ్డి 32
మేడ్చల్ 23