భారీ వర్షాల కారణంగా పెన్నా నదిలో వరద పోటెత్తుతోంది. దీంతో నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో (Kovvur road damaged) 16 నంబరు జాతీయ రహదారి కోతకు గురైంది. నెల్లూరు నగరం దాటాక చెన్నై-కోల్‌కతా మార్గంలో రోడ్డు ధ్వంసమైంది. దీంతో విజయవాడ-నెల్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను పోలీసులు తొట్టంబేడు చెక్‌పోస్టు వద్ద నిలిపివేస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు ఆగిపోయాయి. వాహనదారులు కడప, పామూరు, దర్శి వైపుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. మరోవైపు ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరుకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
కోవూరు వద్ద భగత్‌సింగ్ కాలనీ వద్ద జాతీయ రహదారికి (kovvur highway damaged) మరమ్మతులు చేపడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన చేస్తున్నామని.. అధికారులు తెలిాపారు. ఒక మార్గంలో వాహన రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. రహదారికి రెండో వైపు కల్వర్టు తెగిపోయిందని.. కల్వర్టు నిర్మించాక రెండో వైపు వాహనాలకు అనుమతి ఇస్తామని తెలిపారు. నెల్లూరు-విజయవాడ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కడప-తిరుపతి మార్గంలో రాకపోకలు ఆర్టీసీ నిలిపేసింది. చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలు నిలిపేశారు.
వాయుగుండం దెబ్బకు కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలతో పలు ప్రాంతాలవారు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లల్లోని వస్తువులు, సామగ్రి, నగదు, నగలు, పత్రాలన్నీ వరదనీటిలో కలిసిపోయాయి. పంట పొలాలు మునిగాయి. గ్రామాల్లో అంధకారం అలుముకుంది. రహదారులు మరింత ఛిద్రమయ్యాయి. అనంతపురం జిల్లా కదిరిలో భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులు. వాయుగుండం వల్ల మొత్తంగా వర్షాల(rains) వల్ల వివిధ సంఘటనల్లో 24 మంది మృత్యువాత పడ్డారు. 17 మంది గల్లంతయ్యారు.
చిత్తూరు జిల్లాలో గ్రామాలు కొన్ని ఇంకా ముంపులోనే ఉన్నాయి. తిరుపతి నగరంలోని పలు కాలనీల్లో 3 రోజులుగా మోకాలి లోతు నీరు నిలిచే ఉంది. కడప జిల్లా రాజంపేట, నందలూరు ప్రాంతంలో రెండు గంటల్లోనే ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1,316 గ్రామాలు భయం గుప్పిట్లోకి చేరాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 6.33 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాడి పశువులు, కాడెద్దులు, దూడలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాయి. పంట పొలాల్లో ఇసుకమేటలు, రాళ్లు రప్పలు చేరాయి.
ఇదీచూడండి: వరద ఉద్ధృతిలో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు- చివరకు!