ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాను వానలు ముంచెత్తుతున్నాయి. భారీవర్షాలకు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. భారీవర్షాలకు వివిధరకాల పంటలు దెబ్బతిన్నాయి .జిల్లాలో సగటున 13 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరంలో 20 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా.. 11 మండలాల్లో 15 సెం.మీ.కు పైగా వర్షపాతం ఉంది.
కాల్వలు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. తమ్మిలేరు, ఎర్రకాలువ, కొవ్వాడ, జల్లేరుకు వరదనీరు పోటెత్తుతోంది. ఎర్రకాలువ జలాశయం నుంచి 22 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. తమ్మిలేరు జలాశయం నుంచి 16 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కొవ్వాడ జలాశయం నుంచి 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కొవ్వాడ నుంచి నీటి విడుదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఏలూరులో తమ్మిలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తమ్మిలేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడి.. వరద నీరు ఏలూరులోకి చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
జిల్లాలో గుండేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దెందులూరు మండలంలోని సత్యనారాయణపురాన్ని వరదనీరు చుట్టుముట్టింది. ఇళ్లలోకి వరదనీరు చేరుతోంది.
ఆకివీడు, కాళ్ల, ఉండి, పాలకోడేరు మండలాల్లో రోడ్లు జలమయమయ్యాయి. యనమదుర్రు, బొండాడ, చినకాపవరం డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. భీమవరంలోని హౌసింగ్‌బోర్డ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలు నీట మునిగాయి. తాడేరు రోడ్డు, శ్రీరాంపురం, ఆర్టీసీ బస్‌డిపో జలమయమయ్యాయి.
ఇదీ చదవండి : భాగ్యనగరంలో బీభత్సం.. ప్రతి ఒక్కరు సాయం చేయండి: గవర్నర్