Colour change to jinna tower: గత కొంతకాలంగా వార్తల్లో ఉన్న ఏపీలో గుంటూరు జిల్లాలోని జిన్నా టవర్‌కు.. నగరపాలక సంస్థ అధికారులు జాతీయ జెండా రంగులు వేయించారు. జిన్నా టవర్ పేరు మార్చాలంటూ కొన్నాళ్లుగా భాజపా డిమాండ్ చేస్తోంది. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరును తొలగించి.. జాతీయ నాయకుల పేరును పెట్టాలని భాజపా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. టవర్ పేరు మార్చకుంటే.. కూలుస్తామని హెచ్చరించారు. ఇదిలావుంటే ఇన్నేళ్లుగా నోరు మెదపని భాజపా నేతలు.. ఇప్పుడు జిన్నా టవర్‌పై మాట్లాడమేంటని.. వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో గుంటూరు మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా నగర వాసుల అభిప్రాయాలు తీసుకున్నారు. మంగళవారం టవర్‌కు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు వేయించారు. మరోవైపు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో పలువురు ముస్లిం మతపెద్దలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్, జీఎంసీ కమిషనర్ నిశాంత్‌కుమార్ తదితరులు మాట్లాడారు. పలువురు మత పెద్దలు స్పందిస్తూ.. మత సామరస్యం కోసం చర్యలు తీసుకోవడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. జిన్నా టవర్ వద్ద ఈ నెల 3న జాతీయ జెండా ఎగరవేయాలని సమావేశంలో నిర్ణయించారు.
జిన్నా టవర్ చరిత్ర ఏంటంటే..!
గుంటూరులో ముఖ్యమైన కూడలిగా వెలుగొందుతున్న కట్టడం జిన్నా టవర్. శాంతిచిహ్నంగా కుతుబ్‌మినార్ తరహాలో ఈ టవర్‌ను 1942లో నిర్మాణం చేపట్టి 1945లో పూర్తి చేశారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మహ్మద్ అలీ జిన్నాను స్థానికులు ఆహ్వానించారు. అనివార్య కారణాలతో ఆయన హాజరుకాలేదు. తన ప్రతినిధిగా జుదాలియాఖత్ అలీఖాన్‌ను పంపారు. అప్పటి నుంచి జిన్నా టవర్‌గా ఈ కట్టడానికి పేరొచ్చింది.
ఇదీ చదవండి: