ఆరోగ్యం, చక్కని శరీరాకృతి కోసం నడక, యోగా, ధ్యానం లాంటివి ఎంతో మేలు చేస్తాయి. వాటితో పాటు పరుగు సైతం మంచి అలవాటే. అయితే రోజు 5 నుంచి పది కిలోమీటర్లు పరుగెత్తాలంటే చాలా శక్తి, శరీరంలో పటుత్వం కావాలి. అలాంటిది బెంగళూరుకు చెందిన ఐదు నెలల గర్భిణి అంకితా గౌర్.. 10 కిలోమీటర్ల పరుగును 62 నిమిషాల్లో పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
10కే రన్లో 5 నెలల గర్భిణీ
బెంగళూరులో గత ఆదివారం నిర్వహించిన టీసీఎస్ వరల్డ్ 10కే 2020లో అంకితా గౌర్.. నిర్ణీత లక్ష్యాన్ని గంటలో చేరుకుని అందరికి స్ఫూర్తిగా నిలిచింది. సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలు మామూలుగా నడవడమే కష్టం. అలాంటిది 5 నెలల గర్భవతైన అంకితా గౌర్...ఈ పరుగు పోటీలో కడుపులో ఉన్న బిడ్డతో కలిసి బరిలో నిలిచింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా 10కె రన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
పరుగూ జీవితంలో భాగమే
ఇంజినీర్ అయిన అంకితకు పరుగుతో తొమ్మిదేళ్లుగా అనుబంధం ఉంది. నా శ్వాసలానే .. పరుగు కూడా నా జీవితంలో భాగమే అని పేర్కొంటున్న అంకిత.. పరుగెత్తడం దినచర్యగా మార్చుకుంది. 2013 నుంచి వరల్డ్ 10కె రన్ పోటీల్లో పాల్గొంటున్న ఆమె.. అనేక పతకాలు సొంతం చేసుకుంది. గర్భంతో ఉన్నప్పుడు పరుగు ఎంతో మంచిదని అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ సూచించటంతో.. గైనకాలజిస్ట్‌ను సంప్రదించి పరుగు పోటీలకు సన్నద్ధమైంది.
బిడ్డ ఆరోగ్యానికి మంచిదే
గర్భంతో ఉన్నప్పుడు వ్యాయామాలు చేయడానికి చాలామంది భయపడుతుంటారు. వైద్యులు చెప్పినా కొంతమంది వినరు. కానీ ఈ సమయంలో వ్యాయామం తల్లికే కాక కడుపులో పెరుగుతోన్న బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే అంకిత.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తోంది. నిత్యం ఉదయం, సాయంత్రం రన్నింగ్ చేస్తోంది. గర్భిణులు పరిగెత్తడం వల్ల శరీరం తేలికగా ఉండటమే కాక కొత్త ఉత్సాహం వస్తోందని సూచిస్తోంది. అయితే గర్భం దాల్చినప్పుడు ఒక్కొక్కరి ఆరోగ్యం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిపుణుల సలహాలు పాటించాలని సూచిస్తోంది.
అంతర్జాతీయ మారథాన్లోనూ..
దేశవిదేశాల్లో జరిగిన అనేక పరుగుల పోటీల్లో పాల్గొన్న అంకిత.. బెర్లిన్, బోస్టన్, న్యూయార్క్‌లలో నిర్వహించిన అంతర్జాతీయ మారథాన్‌లలో మెరిసింది. కఠినమైన పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి పరుగు పూర్తి చేసింది. పరుగును తన జీవితంగా మలుచుకున్న అంకిత.. యాప్ ఆధారిత మారథాన్ పోటీలంటే ఆసక్తి చూపిస్తోంది. మరో నాలుగు నెలల్లో తల్లి కాబోతున్న అంకిత.. భర్త, కుటుంబసభ్యుల సహకారంతో పరుగును కొనసాగిస్తోంది.
చిన్నారులకు శిక్షణ
అంకిత.. తన తొమ్మిదేళ్ల పరుగు ప్రస్థానంలో గాయాలు, అనారోగ్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పితే రోజూ పరిగెడుతూనే ఉంది. ఈ ఆరోగ్యమంత్రాన్ని తనకే పరిమితం చేసుకోకుండా యువత, చిన్నారులకు సైతం పంచుతోంది. వారు పరుగుల పోటీల్లో విజేతలుగా నిలిచేందుకు అవసరమైన శిక్షణా తరగతులు అందిస్తోంది. మారథాన్ పోటీలకు సన్నద్ధం చేస్తోంది. అలా ఆరోగ్యం పంచే పరుగును అందరికి చేరువ చేస్తోంది..అంకితా గౌర్.