Bathukamma celebrations: తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ శోభ ఉట్టిపడింది. ఊరూ వాడా.. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి.. రాగయుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. చౌరస్తాలన్నీ బతుకమ్మలతో, ఆడపడుచులతోనూ మురిసిపోయాయి. మహిళామణుల పండుగగా పిలుచుకోనే బతుకమ్మలో సందడిగా ఆడిపాడుతున్నారు. బతుకమ్మ పండుగలో మొదటిరోజైన ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు ఆహ్లాదంగా సాగాయి.
హైదరాబాద్లోని ఎల్బీనగర్ పరిధిలో ఉన్న చిత్ర లేఅవుట్ కాలనీలో ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలను చిత్ర లేఅవుట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాలనీలోని మహిళలంతా పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి దాండియా, బతుకమ్మ కోలాట ఆటలను ఆడారు. డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ సంతోషంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం లాగానే బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. అన్ని పండుగలను కాలనీలోని అందరం ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటూ పిల్లా పాపలతో ఎంతో సంతోషంగా జరుపుకుంటామని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: