జనావాసాలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త, వ్యర్థాల దహనం పెనుముప్పుగా మారుతోంది. ముఖ్యంగా వేసవి కాలంలో దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యర్థాల్ని దహనం చేసినప్పుడు సమీప ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తాయి. నిప్పురవ్వలు భారీగా ఎగిసిపడి సమీపంలోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు వ్యాపించే ప్రమాదముంది. ఫిబ్రవరి రెండో వారంలో జూబ్లీహిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు కార్లు దగ్ధమైన విషయం విదితమే. దీనికి కారణం సమీపంలో చెత్త తగలబెట్టడమేనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలో పాత నగరంలో ప్రభుత్వ పాఠశాల, అబిడ్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలోనూ అగ్ని ప్రమాదానికి కారణం వ్యర్థాల దహనమేనని అధికారులు తెలిపారు.
సిగరెట్టు ఆర్పకుండా వేస్తే అంతే..!
బహిరంగ ప్రదేశాల్లో చెత్త, వ్యర్థాల్లో మంటలు చెలరేగడానికి ధూమపాన ప్రియుల నిర్లక్ష్యం కూడా ఓ కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. కాల్చిన సిగరెట్లు, బీడీలను ఆర్పేయకుండా చెత్తకుప్పల్లో విసిరేస్తున్నారు. ఇవి క్రమంగా అంటుకుని అగ్గిని రాజేస్తున్నాయి. చెత్త కుప్పల్లో మంటలు చెలరేగడానికీ ఐదు శాతం వరకూ ఇదే కారణమని అధికారులు అంటున్నారు.
అధికారుల సూచనలివీ..
- చెత్తను బహిరంగ ప్రదేశాల్లో దహనం చేయొద్దు.
- వ్యర్థాలను నిర్దేశిత ప్రాంతంలో కుండీల్లోనే కప్పి ఉంచాలి.
- రహదారుల వెంట చిన్నపాటి మంటలు కనిపించినా అగ్నిమాపక శాఖను సంప్రదించాలి.
రోజూ సగటున మూడు ఫిర్యాదులు..?
- అగ్నిమాపక శాఖకు వస్తున్న ఫిర్యాదుల్లో దాదాపు సగానికిపైగా వ్యర్థాల దహనానికి సంబంధించినవే ఉంటున్నాయి.
- హైదరాబాద్ జిల్లా పరిధిలో రోజూ సగటున మూడు ఫిర్యాదులు వస్తున్నాయి.
- జిల్లాలో ఏటా సగటున 1500 అగ్ని ప్రమాదాలు జరగ్గా, వాటిల్లో సగానికిపైగా వ్యర్థాల దహనానివే ఉంటున్నాయి.
ఇదీ చూడండి: