విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగలతో మంటలు ఎగసిపడ్డాయి. భారీ శబ్దం వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అత్యంత ప్రమాద సమయాల్లో మోగించిన మూడు సైరన్లు మోగించి ఉద్యోగులను బయటకు పంపివేశారు.
అందుకే భారీ ప్రమాదం..
హెచ్‌పీసీఎల్ పాత టెర్మినల్ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏ విభాగంలో ప్రమాదం జరిగింది.. కారణాలు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. తాజా ఘటనలో గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంధనం నిల్వ చేసే పెద్ద ట్యాంక్ పేలి ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముడి చమురు ప్రాసెస్ సమయంలో పేరుకుపోయిన కర్బన పదార్థాలు అప్పుడప్పుడూ పేలడం ఇక్కడ సర్వసాధారణం. అయితే, తాజా ప్రమాదంలో మరీ ఎక్కువగా మంటలు ఎగసిపడడం వల్ల భారీ ప్రమాదమే జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
నీటితో మంటలను అదుపుచేయలేరు!
విశాఖ హెచ్‌పీసీఎల్‌లో మూడు యూనిట్లు ఉన్నాయి. తాజా ప్రమాదం సీడీయూ మూడో యూనిట్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇది చాలా సున్నితమైన యూనిట్, అతి ఎక్కుగా మండే పదార్థాలు ఇక్కడ ఉంటాయి. నిరంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉంటారు. అత్యాధునిక పరికరాలతో మంటలు అదుపుచేశారు. ఇక్కడ నీటితో మంటలను అదుపు చేసే వీలుండదు.. కేవలం కొన్ని రసాయనాలతో మాత్రమే మంటలను అదుపు చేయాలి.
వైద్య సేవలను అందించేందుకు కొన్ని అంబులెన్స్‌లను కూడా అక్కడ సిద్ధం చేశారు. ప్రమాద సమయంలో యూనిట్‌లో ఆరుగురు సిబ్బందితో పాటు మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ముడి చమురును ఈ యూనిట్‌లోనే ప్రాసెస్ చేస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. యూనిట్ మొత్తం మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.
విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఆరు అగ్నిమాపక శకటాలతో మంటలను 30 నిమిషాల్లో అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికి గాయాలు కాలేదు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
-వినయ్‌చంద్, విశాఖ కలెక్టర్
ఇవీచూడండి: ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి