అంబర్‌పేట డివిజన్లో నిర్వహించిన తెరాస పార్టీ కార్యకర్తల సమావేశంలో భారీ తోపులాట జరిగింది. పార్టీకి చెందిన ఇరు వర్గాల శ్రేణులు వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. రానున్న ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, నియాజక వర్గ తాత్కాలిక పరిశీలకుడు కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం, పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న ఉద్యమకారులకే టికెట్ ఇవ్వాలని పలువురు కార్యకర్తలు డిమాండ్ చేశారు.
గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డామని ఈసారి తమకే కేటాయించాలని నేతలపై ఒత్తిడి చేశారు. ప్రస్తుత కార్పొరేటర్ ఒంటెద్దు పోకడ పోతున్నాడని ఆరోపిస్తూ.. కార్తీక్ రెడ్డి ముందు వ్యక్తిగత దూషణలకు దిగారు. అయితే ఇది కార్పొరేటర్ ఎంపిక మీటింగ్ కాదని కార్తీక్‌రెడ్డి వారికి సర్ది చెప్పి వెళ్లిపోయాడు. టికెట్ ఎంపిక అధిష్ఠానం చూసుకుంటుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.