ఏపీలోని విశాఖపట్నంలో తెదేపా ఎమ్మెల్యేపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో తెదేపా, వైకాపా నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్ద శనివారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పెద్ద సంఖ్యలో తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న వెలగపూడి ఎంపీ విజయసాయిరెడ్డిపై మరోసారి మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని ఆయన స్పష్టం చేశారు. ‘నేను విజయసాయిరెడ్డికి సవాలు విసిరితే మధ్యలో వీళ్లేవరు. నేను విజయసాయిరెడ్డిని ప్రమాణం చేయమన్నాను’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంతో నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నానన్నారు. సింహాచలం వచ్చి ప్రమాణం చేయాలని వైకాపా నేతలు అంటున్నారని.. ఆ సవాలు స్వీకరిస్తున్నానని.. అక్కడ ప్రమాణం చేయడానికి విజయసాయిరెడ్డి వస్తారా.? అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో వైకాపా నాయకురాలు విజయనిర్మల సాయిబాబా చిత్రపటంతో ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె వెనక్కి వెళ్లిపోయారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా తెదేపా, వైకాపా నాయకుల మధ్య ప్రమాణ సవాళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే.
సంబంధిత కథనం: ఏపీలో నేతల ప్రమాణ సవాళ్లు.. అప్రమత్తమైన పోలీసులు