విత్తన రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రశంసించింది.
ఇటలీలోని ఐక్య రాజ్య సమితి, ఎఫ్ఏఓ అగ్రికల్చర్ అండ్ కన్సూమర్ ప్రొటెక్షన్ ఆసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా.బూకార్ టిజానీ, ఎఫ్ఏఓ విత్తన విభాగం ప్రతినిధి, డా.చికెలు బాతో తెలంగాణ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్(ఇస్టా) వైస్ ప్రెసిడెంట్ డా. కేశవులు సమావేశమయ్యారు.
ఇస్టా వైస్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి ఎఫ్ఏఓలో అత్యున్నత స్థాయి సమావేశాలకు డా.కేశవులు హాజరయ్యారు. తెలంగాణ విత్తన పరిశ్రమ, రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ఎఫ్ఏఓకు వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.
తెలంగాణ చేపడుతున్న సీడ్ బౌల్ కార్యక్రమాలను... ఆసియా, ఆఫ్రికా దేశాలలో అమలు పరచి విత్తన రంగాన్ని పటిష్ఠపరుస్తామని ఎఫ్ఏఓ ప్రకటించింది.
గతేడాది హైదరాబాద్‌లో అంతర్జాతీయ విత్తన సదస్సు నిర్వహించారు. అప్పుడు ఎఫ్ఏఓ సహకారంతో ఆఫ్రికా దేశాల ప్రతినిధులకు నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన ఎగుమతులపై వర్క్‌షాప్ నిర్వహించామని డా.కేశవులు తెలిపారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి తెలంగాణను ప్రశంసించింది.
తెలంగాణలో 1500 గ్రామాల్లో, 3 లక్షల మంది రైతులు దాదాపు 7 లక్షల ఎకరాలలో విత్తనోత్పత్తి చేపట్టి, దేశంలో 60% విత్తనాలు సరఫరా చేసిందని కేశవులు తెలిపారు.
అంతే కాకుండా 20 దేశాలకు విత్తనాలు ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 400 విత్తన కంపెనీలు ఉన్నాయని... దాదాపు 5వేల కోట్ల విత్తన వ్యాపారం జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విత్తన రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎఫ్ఏఓ గుర్తించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ఉత్కంఠ: హజీపూర్ కేసులో నేడు తుదితీర్పు