Rajat Bhargava on Liquor : ఏపీలో 2019-20లో 20 మద్యం బ్రాండ్లకు అనుమతిచ్చామని ఆ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ వెల్లడించారు. 2020 తర్వాత ఏ బ్రాండుకూ అనుమతివ్వలేదని చెప్పారు. ప్రస్తుతం 76 మంది సరఫరాదారులకు చెందిన 300 మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 2020-21 మధ్య రాష్ట్రంలో 1.55 లక్షల మద్యం నమూనాలను పరీక్షించామని, వాటిలో ప్రాణాంతకమైనవి ఏమీ లేవని తేలిందని ప్రకటించారు. మొత్తం బ్రాండ్లలో వేటికి ఎప్పుడు అనుమతిచ్చారో జాబితా ఇవ్వాలని విలేకరులు అడగ్గా.. ఇస్తామన్నారే తప్ప ఇవ్వలేదు. 2019 ఫిబ్రవరి తర్వాత కొత్తగా ఒక్క డిస్టిలరీ ఏర్పాటుకూ అనుమతివ్వలేదన్నారు. ఉన్న వాటిలో ఏవైనా చేతులు మారాయా? అనే విషయం వెల్లడించలేదు.
విలేకరుల ప్రశ్నలకు సమాధానాలివీ..
- రాష్ట్ర ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్న మద్యంలో ప్రాణాంతక పదార్థాలు ఉన్నాయని ఎంపీ రఘురామ చేయించిన పరీక్షల్లో తేలింది కదా?
సాధారణ ప్రజానీకానికి రసాయన పరీక్షల గురించి తెలియదు. 2020-21లో మేము 1.55 లక్షల మద్యం నమూనాలకు పరీక్షలు చేయించాం. ఎక్కడా అవి ప్రాణాంతకమని నిర్ధారణ కాలేదు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం తాగు నీటిలో మిథైల్ బ్రోమియం 0.2% ఉండొచ్చు. 0.1% ఉన్నా సమస్యగా చెబితే ఎలా? ఇదీ అలాంటిదే.
- పేరొందిన మద్యం బ్రాండ్లు ఇప్పుడు ఎందుకు అందుబాటులో లేవు?
బయట తయారయ్యే బ్రాండ్ల మద్యాన్ని కొవిడ్ తర్వాత వారు సరఫరా చేయటం ఆపేశారు. దాంతో స్థానికంగా ఉండే డిస్టిలరీల్లో తయారయ్యే రకాలకు డిమాండు పెరిగింది. కింగ్‌ఫిషర్ సంస్థ మేము కొంటున్న ధరలపై అదనంగా రూ.20 చొప్పున పెంచాలని అడిగింది. అంత చెల్లించి కొనాలా?
- మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు అందుబాటులో లేవు?
మరో పదిహేను రోజుల్లో ప్రారంభిస్తాం.
- జంగారెడ్డిగూడెంలో కల్తీసారా మరణాలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?
వారంతా శ్వాస ఆడక, గుండెపోటుతో చనిపోయారు. కొందరికి ఎక్కువగా మద్యం తాగే అలవాటు ఉండటంవల్ల మరణించారు. అవి కల్తీ సారా మరణాలు కావు. జనాభాలో ఏటా 2%మంది చనిపోతారు. జనాభాలో 25% తాగేవారు ఉంటారు. అంటే ఏటా చనిపోయే రెండు శాతంలో 0.5% మంది తాగటంవల్లే చనిపోయినట్లా? కాదు కదా!
- ఒకటి, రెండు రోజుల్లో ఒకే లక్షణాలతో ఒకే ఊళ్లో అంతమంది ఎలా చనిపోతారు? చనిపోవటానికి కొన్ని గంటల ముందు వారు సారా తాగారని కుటుంబ సభ్యులే చెబుతున్నారు కదా?
వారు ఒకే లక్షణాలతో చనిపోలేదు. వేర్వేరు సమయాల్లో చనిపోయారు. వారెవరూ ఒకే చోట సారా కొనలేదు, తాగలేదు.
- ఇదీ చదవండి : మాంసం ముక్కల కోసం గొడవ.. ఓ నిండు ప్రాణం బలి !