ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశలో కరోనా విజృంభణతో ఆందోళన నెలకొంది. కొత్తగా 7వేల 224మంది కరోనా బారిన పడ్డారు. మరో 15మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. ఒక్కరోజు వ్యవధిలో 35 వేల 907మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... ఒక్క చిత్తూరు జిల్లాలోనే.. వెయ్యి 51మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధరించారు. ఇదే జిల్లాలో నలుగురు కరోనాకు బలయ్యారు.
తూర్పుగోదావరి జిల్లాలో 906 మంది, గుంటూరు జిల్లాలో 903 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. నెల్లూరు జిల్లాలో కరోనా వల్ల ముగ్గురు మృతిచెందారు. కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. కొత్తగా 2 వేల 332 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 40 వేల 469 క్రియాశీల కేసులున్నాయి.
కృష్ణా జిల్లా చల్లపల్లి గురుకుల పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయం తెలుసుకుని పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు... తమ పిల్లలను ఇంటికి పంపించేయాలని డిమాండ్ చేశారు.
కర్నూలు విమానాశ్రయంలో ఆరుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రయాణికులకూ ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో... కేసులు పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో 3 వేల 6 వందల 61 యాక్టివ్ కేసులు ఉండగా... 181 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టీకా అందుబాటులో లేకపోవటంపై తొలిడోసు వేయించుకున్నవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలోనూ కేసుల సంఖ్య పెరగటంతో... నియంత్రణకు కార్యాచరణ రూపొందంచారు. ప్రకాశం జిల్లాలో రెండో దశలో యువత ఎక్కువగా కరోనా బారినపడుతున్నారని కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ఇతర ప్రాంతాల్లో చదువుకుని సొంత ఊళ్లకు వచ్చి... విచ్చలవిడిగా తిరగటమే దీనికి కారణమని చెప్పారు.
ఏపీ వ్యాప్తంగా కరోనాపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికారులు, పోలీసులు రోడ్లపైకి వచ్చి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మాస్కులు ధరించని వారికి ఉచితంగా పంపిణీ చేశారు. కృష్ణా జిల్లాకు కొత్తగా 57 వేల డోసులు చేరుకోవటంతో... సోమవారం నుంచి వ్యాక్సినేషన్ మళ్లీ ప్రారంభంకానుంది. ముందుగా ప్రభుత్వ అధికారులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా వేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. రెండో డోసు కోసం వస్తున్నవారికీ అవకాశం కల్పిస్తామన్నారు.
ఇదీ చదవండి: 'తీవ్రంగా రెండోదశ... యువతలో వ్యాప్తి అధికం'