రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తెరాస నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి విరుచుకుపడ్డారు. మీర్‌పేట్‌ను సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మీర్‌పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని వెల్లడించారు.
సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆయన చెరువులు, పాఠశాలల స్థలాలను వదలడం లేదని ఆరోపించారు. తమ పార్టీ నుంచి మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తిచేయలేదన్నారు. మంత్రి సబిత వైఖరిపై సీఎంతో మాట్లాడతానని తీగల కృష్ణారెడ్డి తెలిపారు.
గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ తరఫున సబితా ఇంద్రారెడ్డి తెరాస నుంచి తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా సబిత విజయం సాధించారు. అనంతరం సబితారెడ్డి తెరాస కండువా కప్పుకుని మంత్రి పదవి పొందారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
నియోజకవర్గంలో తీగల కృష్ణారెడ్డి ఓ వర్గం కొనసాగుతుండగా మంత్రి సబితా ఇంద్రారెడ్డిది మరోవర్గం ఉంది. సబితారెడ్డి తెరాసలో చేరి మంత్రి పదవి పొందటంతో తనకు ప్రాధాన్యం తగ్గిందని తీగల భావిస్తున్నారు. కొన్నాళ్లుగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు తీగల తాజా వ్యాఖ్యలతో బహిర్గతమయ్యాయి.