ఉద్యమంతో సంబంధం లేని మంత్రి... హుజురాబాద్ ప్రజాప్రతినిధులపై గొర్రెల మందపై తోడేళ్లలా దాడి చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. కరోనాతో ప్రజలు మరణిస్తుంటే గాలికొదిలేసి.. ప్రజా ప్రతినిధులను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. ఇరవై ఏళ్లుగా ఉద్యమాన్ని కాపాడి ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన హుజురాబాద్ ప్రజాప్రతినిధులను మంత్రి, సీఎం నియమించిన కొందరు ఇంఛార్జీలు కుట్రలకు పాల్పడితే సహించేది లేదని ఈటల హెచ్చరించారు.
కరోనా నియంత్రణపై దృష్టి పెట్టాల్సిన సమయంలో... రాజకీయాలు చేయడం లేదన్నారు. సమయమొచ్చినప్పుడు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. కొంతమందిపై ఒత్తిడి తెచ్చి వారికి ఇష్టం లేకపోయినప్పటికీ.. తనకు వ్యతిరేకంగా ప్రకటనలిప్పిస్తున్నారని ఆరోపించారు. పిడికెడు మందితో ప్రకటనలు చేయించినంత మాత్రాన ప్రజాభిప్రాయాన్ని మారుస్తామనుకోవడం వెర్రితనమేనని ఈటల వ్యాఖ్యానించారు. తల్లిని బిడ్డను వేరుచేసినట్లు మానవత్వం లేకుండా ప్రవరిస్తున్నారని.. ఇప్పటికైనా అలాంటి చర్యలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈటల హెచ్చరించారు.