కరోనా విజృంభణతో జనం వణికిపోతున్నా.. లాక్‌డౌన్ సమయంలోనూ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పెళ్లిళ్లు.. పుట్టినరోజు వేడుకలు.. తల్వార్లతో నృత్యాలు జోరుగా కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో ఆహ్వానితులు, బ్యాండ్‌లు.. డీజేలతో మోతమోగిస్తున్నారు. స్థానికులు శబ్దాలు, అరుపులు భరించలేక పోలీసులుకు ఫిర్యాదు చేస్తే వారు వేడుకలన్నీ ముగిశాక వచ్చి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గస్తీ బృందాలకు సమాచారమున్నా మిన్నకుండి పోతున్నారు.
పెళ్లిళ్లు.. పుట్టినరోజు వేడుకలు
నగరం, శివారు ప్రాంతాల్లో పదిరోజుల నుంచి రాత్రివేళల్లో వరుసగా పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఎక్కువగా పాతబస్తీ, పశ్చిమ మండలం, ఎల్బీనగర్, మియాపూర్, ఉప్పల్, శామీర్‌పేట, మొయినాబాద్ ప్రాంతాల్లోని రిసార్ట్‌లు, ఫామ్‌హౌసుల్లో కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్ సమయానికన్నా ముందు అక్కడికి కార్లలో చేరుకుని వందల మంది రాత్రంతా విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారు. పదిరోజుల క్రితం ఓ ప్రముఖ రిసార్ట్‌లో జరిగిన పెళ్లి వేడులకు 200 మంది హాజరయ్యారు. కొద్దిసేపు మాస్కులు ధరించి, తర్వాత తీసేసి ఫొటోలకు ఫోజులిచ్చారు.
ఇక పాతబస్తీ, పశ్చిమ మండలంలో ఇళ్ల వద్దే షామియానాలు వేసి గల్లీల్లో రహదారులకు అడ్డంగా కర్రలు పెట్టి పెళ్లి భోజనాలు పెడుతున్నారు. అంతకుముందు డీజేలతో నృత్యాలు చేస్తున్నారు. పుట్టినరోజు వేడుకల్లోనూ ఇదేతంతు. హబీబ్‌నగర్ ఠాణా పరిధిలో భాజపా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా తల్వార్లతో డాన్స్‌లు చేశారు.
పెట్రోలింగ్ అంతంతే!
రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించే గస్తీ బృందాలు అంతంత మాత్రంగానే విధులు నిర్వహిస్తున్నాయి. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో ప్రతి ఠాణాకు రాత్రివేళల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, రౌడీషీటర్లు, వారి అనుచరుల ఇళ్లకు వెళ్లి హాజరు తీసుకునేందుకు రెండు గస్తీ వాహనాలున్నాయి. దీంతో పాటు గల్లీలకూ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తుండాలి. కొన్ని ఠాణాల్లో గస్తీ బృందాలు వారి పరిధుల్లో ఏం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో లాక్‌డౌన్ సమయంలో రాత్రివేళల్లో యువకులు బయటకు వస్తున్నా.. ఘర్షణలు పడుతున్నా పోలీసులకు తెలియడం లేదు.
- ఇదీ చదవండి : తల్వార్‌తో కేక్ కట్.. 14 మందిపై కేసు