సహకార సంఘాలకు జవసత్వాలు కల్పించేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు కంకణం కట్టుకుందని నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు తెలిపారు. రుణాలు ఇవ్వడం... వసూలు చేయడానికి పరిమితం కాకుండా బహుళ సేవలు అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. విజయవాడ స్టెల్టా మేరీస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన హస్తకళల ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని సహకార సంఘాలకు పూర్వవైభవం వస్తుందని తాము ఆశిస్తున్నామని చెప్పారు. ఐదు వేల సహకార సంఘాల్ని మల్టీసర్వీసెస్ సొసైటీలుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. వీటిలో 3,500 సొసైటీలకు ఆర్ధిక సాయం అందించామన్నారు.
ఈటీవీ భారత్: కొవిడ్‌తో వ్యవసాయానికి పెద్దగా ఇబ్బందులున్నాయా?
నాబార్డ్ ఛైర్మన్ : కొవిడ్ కారణంగా వ్యవసాయం దెబ్బతినలేదు. వ్యవసాయం బాగా వృద్ధి చెందింది. దేశ ఆర్థిక వ్యవస్థలో లోటు కనిపిస్తున్నా, వ్యవసాయంలో మాత్రం ప్రతి త్రైమాసికంలో 3.4 శాతం మేర పెరిగింది. ఈ ఏడాది వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అన్నీ అధిక ధరలకు అమ్ముడవుతున్నాయి. ఇంకో ఏడాది కాలం ఇదే ఒరవడి ఉంటుంది. అందుకే కొవిడ్ మూలాన రైతులకు నష్టం జరగలేదు. అయితే వ్యవసాయ రుణాలు ఆందోళన నెలకొన్న మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ ప్యాకేజి ప్రకటించిన సమయంలో దీనిపై బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. బ్యాంకులు ఇచ్చే లోన్లను పెంచాలని స్పష్టంగా చెప్పింది. తక్కువ వడ్డీ కింద ఇచ్చే రుణాలను కూడా ఈ ఏడాది 25వేల కోట్లు పెంచాలని సూచించింది. మేం కూడా పంట రుణాలకు సుమారు లక్షా 20వేల కోట్ల రూపాయలు అతి తక్కువ వడ్డీకి ఇచ్చాం. దీని మూలంగా రైతులకు సుమారు 4 నుంచి 5 శాతం వడ్డీ తగ్గింది. రైతులకు మేలు జరిగింది.
ఈటీవీ భారత్: బ్యాంకుల ప్రైవేటీకరణతో నష్టం ఉందా..?
నాబార్డ్ ఛైర్మన్ : బ్యాంకుల ప్రైవేటీకరణతో వ్యవసాయానికి వచ్చే రుణాలు తగ్గవు. ఎందుకంటే ప్రాధాన్యత రంగానికి 40శాతం ఇవ్వాల్సి ఉంటుంది. 18శాతం వ్యవసాయ రుణాలు తప్పనిసరి. దేశంలో 11లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తుంటే అందులో ప్రాధాన్యత రంగాలకు 35 నుంచి 40 లక్షల కోట్లు వస్తాయి. అలాగే వ్యవసాయ రంగానికి 18 శాతం అంటే రూ.15 నుంచి 16 లక్షల కోట్లు ఇవ్వాల్సిందే. బ్యాంకర్లు వ్యవసాయానికి తగ్గిస్తే... ప్రాధాన్యత రంగాల్లో తగ్గుదల కనిపిస్తుంది. అప్పుడు గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ద్వారానైనా ఆ లోటు పూడ్చాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి విదేశీ బ్యాంకులు కూడా ప్రాథమిక రంగాలకు ఇవ్వాల్సిన లక్ష్యం పూర్తి చేయకపోతే... ఆర్ఐడీఎఫ్ ద్వారా భర్తీ చేస్తాయి. అందుకే ప్రైవేటీకరణ వల్ల వ్యవసాయ రుణాలకు వచ్చే ముప్పు లేదు. ప్రైవేటీకరణ వల్ల బ్యాంకుల పనితీరు మెరుగుపడుతుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. దేని ప్రయోజనం దానికి ఉంటుంది.
ఈటీవీ భారత్: గ్రామీణ రోడ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఎలా..?
నాబార్డ్ ఛైర్మన్ : మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఆర్ఐడీఎఫ్ కింద 2.7శాతంతో అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణం ఇస్తున్నాం. ఈ ఏడాది రూ.30వేల కోట్ల బడ్జెట్ ఉంటే ఏపీకి రూ.1,700 కోట్ల రుణాలు ఇచ్చాం. ఇతర రాష్ట్రాలు రోడ్ల అభివృద్ధి కోసం వాడుతున్నాయి. భవిష్యత్తులో మన వద్ద కూడా రోడ్లు వేసేందుకు వాడొచ్చు. మౌలిక సదుపాయాల కోసం ఇతర స్కీముల్లోనూ రుణాలు ఇస్తాం.
ఈటీవీ భారత్: నేల సంరక్షణ, నీటి ఆదాకు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి?
నాబార్డ్ ఛైర్మన్ : గత 20, 30 ఏళ్లుగా రైతులు ఎరువులు విపరీతంగా వాడుతున్నారు. దీంతో పంట ఉత్పత్తి బాగా పడిపోయింది. భూమిలో సారం తగ్గటమే దీనికి కారణం. మళ్లీ నేలను సారవంతం చేయాలంటే ఆర్గానిక్ లేదా ప్రకృతి వ్యవసాయమే మార్గం. ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఎడారి నివారణ అరికట్టడంపైనా పనిచేస్తున్నాం. ఎక్కడ భూములు ఎడారిగా మారుతున్నాయో వాటిని సంరక్షించటంలో మేం భాగస్వాములం అవుతున్నాం. కాలువల ద్వారా నీటి పారుదల నుంచి పక్కకు రావాలి. బిందు, తుంపర్ల సేద్యానికి మళ్లాలి. అందుకే సూక్ష్మసేద్యానికి నిధులు పెంచాం. దేశంలో 6 రాష్ట్రాలు కేంద్రం, నాబార్డ్‌తో ఒప్పందం చేసుకుని సూక్ష్మసేద్యాన్ని పెంచాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి. 12లక్షల హెక్టార్లు సూక్ష్మసేద్యం కిందకు రావటంతో నీటి ఆదా పెరిగింది. అందుకే దీనికి బడ్జెట్ పెంచాలని మేం కేంద్రాన్ని కోరాం. గతేడాది కంటే రూ.5వేల కోట్ల అదనంగా పెంచారు. నీటిని సద్వినియోగం చేసుకోవటం ముఖ్యం. రాబోయే కాలంలో నీటి లభ్యత తగ్గుతుంది కాబట్టి మనం మేల్కోవాలి. ఆదా చర్యలు చేపట్టాలి.
ఈటీవీ భారత్: రైతు ఉత్పత్తి సంఘాలను మీరు ఎలా ప్రోత్సహిస్తారు..?
నాబార్డ్ ఛైర్మన్ : రైతు ఉత్పత్తి సంఘాల్లో ఉన్న రైతులకు పెట్టుబడులు 30శాతం తగ్గాయి. కేవలం పంట పండించి అమ్మటం కాకుండా దాన్ని ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేయాలని కోరుతున్నాం. తద్వారా చాలా ఫలితాలు వస్తున్నాయి. ఇలా చేస్తున్న ఎఫ్‌పీవోలు ఏటా రూ.15 కోట్లకుపైగా టర్నోవర్ సాధిస్తున్నాయి. రైతులు సంఘటితమైతే ఆదాయం 50 నుంచి 60శాతం పెరుగుతుంది. మార్కెట్ ఒడుదుడుకుల సమస్యతలెత్తదు. ఈ ఏడాది 10వేల ఎఫ్‌పీవోలు ఏర్పాటు లక్ష్యమని కేంద్రం చెప్పింది. ఇది చాలా తక్కువ. 14.5 కోట్ల మంది రైతులకు చూస్తే ఇది చాలా తక్కువ సంఖ్య. ఇంకా పెరగాలి. రైతులే సొంతగా ఎఫ్‌పీవోలు ప్రారంభించుకోవాలి. రాబోయే కాలంలో రైతులంతా సంఘటితంగానే వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. అంతా కలిసికట్టుగా ఒక పంట వేసుకుంటే మార్కెట్ ధర నిర్ణయించుకోవచ్చు.
ఈటీవీ భారత్: వ్యాల్యూ అడిషన్, ఆహారశుద్ధి పరిశ్రమలతో అనుసంధానానికి రుణాలు ఇస్తారా..?
నాబార్డ్ ఛైర్మన్ : ఆహారశుద్ధి పరిశ్రమలకు నాబార్డ్ ద్వారా రాయితీతో కూడిన రుణాలు ఇస్తున్నాం. ప్రస్తుతం 5శాతం మాత్రమే మనదేశంలో ప్రాసెసింగ్ చేస్తున్నారు. దాన్ని 20శాతానికి తీసుకెళ్లగలిగితే సాధారణ పంటలతో పాటు పండ్లు, కూరగాయలకు మంచి ధరలు లభిస్తాయి. దేశంలో ఏటా రూ.90 వేల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు పాడైపోతున్నాయి. ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటైతే వృథా అరికట్టవచ్చు. పంట వ్యర్థాలను మనం అలాగే వదిలేస్తున్నాం. దేశంలో 800 మిలియన్ టన్నుల బయో వేస్ట్ వస్తోంది. దాన్నుంచి బయో రిఫైనరీ, ఇథనాల్ వంటివి తయారు చేయవచ్చు. భూమిపై పండిన ఏదీ వృథా కావొద్దు. ఇలా చేస్తే రైతులకు ఆదాయం వస్తుంది.
ఈటీవీ భారత్: గ్రామాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వటంలో మీ పాత్ర..?
నాబార్డ్ ఛైర్మన్ : నైపుణ్య శిక్షణ కోసం కేంద్రం పెద్దస్థాయిలో పనిచేస్తోంది. నాబార్డ్ నుంచి కూడా చేస్తున్నాం. వ్యవసాయ రంగంలోనూ నైపుణ్యత పెంచాలి. జీవనోపాధులు పెంచటం పైనా దృష్టి సారించాం. కొవిడ్ సమయంలో కూలీలు సొంతూళ్లకు తిరిగి వచ్చారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో వారికి శిక్షణ ఇవ్వటం ద్వారా 10వేల మందికి ఉపాధి దొరికింది. దీన్నివిస్తృతం చేసే దిశగా నాబార్డ్ కృషి చేస్తోంది. గ్రామాల్లో మహిళలు, యువతుల సాధికారత కోసం పని చేస్తున్నాం. నాబార్డ్ ప్రారంభించిన స్వయం సహాయ సంఘాలు ఇపుడు కోటి 8 లక్షలకు చేరుకున్నాయి. 13 కోట్ల వరకూ మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారికి లక్ష కోట్ల రుణాలు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు మళ్లేలా కార్యక్రమాలు చేపడుతున్నాం.
ఈటీవీ భారత్: చిన్నకమతాల్లోనూ యంత్రాలు వాడొచ్చా..?
నాబార్డ్ ఛైర్మన్ : అంతర్జాతీయంగా యాంత్రీకరణ పెరిగింది. చైనా వంటి దేశాల్లో చిన్నచిన్న కమతాల్లో కూడా యంత్రాలు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. మనం కూడా ఆ దిశగా ప్రయత్నించాలి. అలాగని అన్ని యంత్రాలు కొనాల్సిన పనిలేదు. వాటి రుణం, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు వస్తాయి. కస్టం హైరింగ్ కేంద్రాల ఏర్పాటు దీనికి పరిష్కారం. అక్కడి నుంచి అద్దెకు తీసుకుంటే పని సులువవుతుంది. రైతులకు ఖర్చు తగ్గుతుంది. కూలీల సమస్య ఉండదు.
ఇదీ చదవండి : 'కరోనాతో కొత్తగా పేదరికంలోకి వెళ్లిన 13.1 కోట్ల మంది'