Etela Warning to TRS ప్రజల్లో పలుకుబడిని కోల్పోయిన తెరాస నాయకులు అసహనంతో భాజపా నాయకులపై దాడులకు దిగుతున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. భవిష్యత్తులోనూ తెరాస నాయకులు ఇదే తరహాలో ప్రవర్తిస్తే తమ ఆగ్రహానికి గురికాక తప్పదని ఈటల హెచ్చరించారు. ఇలాంటి నీచమైన సంస్కృతిని రాజకీయాలకు అంటిస్తే అందులోనే మాడి మసైపోతారని అన్నారు. ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు.
పోలీసుల అనుమతితో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్రలో దాడికి దిగడం దారుణమని ఈటల అభిప్రాయపడ్డారు. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పని చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని తెరాస నాయకులు దాడికి దిగుతున్నారని.. పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని ఈటల సూచించారు.
అసలేం జరిగిందంటే ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ జనగామ జిల్లాలో పర్యటించారు. దేవరుప్పలలో కొనసాగుతున్న యాత్రలో బండి సంజయ్ తెరాసపై, కేసీఆర్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తెరాస, భాజపా శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో పలువురు భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ప్రజా సంగ్రామ యాత్రలో దేవరుప్పులలో మాట్లాడిన బండి సంజయ్ తెరాస హయాంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని.... ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీని విస్మరించారని మండిపడ్డారు. ఈ క్రమంలో... బండి సంజయ్ వ్యాఖ్యలపై తెరాస శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్రప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. దీనిపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెరాస ఎన్నికల ప్రణాళికలోని ఎన్ని హామీలను నెరవేర్చారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తెరాస నేతలు భాజపాపై దాడికి తెగబడటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.