ప్రజల ఆర్థిక కార్యకలాపాలు, స్థితిగతులను అధ్యయనం చేసి సంక్షేమ పథకాలను రూపొందించడం... ఆర్థిక సర్వే ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఏడో ఆర్థిక సర్వే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో... సీఎస్‌సీ సమన్వయంతో సాగుతోంది. రాష్ట్రంలో తెలంగాణ ఐటీ అసోసియేషన్ అనుబంధ సంస్థ-డిజిథాన్, సీఎస్‌సీ సంయుక్తంగా సర్వే నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తెలంగాణ అర్బన్‌లో సమాచార సేకరణ కోసం 1112 అర్బన్ యూనిట్లు ఉండగా... గ్రేటర్ పరిధిలో 573 ఇన్వెస్టిగేటర్ యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు పది మంది వరకు ఎన్యుమరేటర్ల అవసరం పడనుంది.
కేవలం హైదరాబాద్‌లోనే దాదాపుగా 6000 మంది, రాష్ట్రవ్యాప్తంగా 11 నుంచి 12 వేల మంది ఎన్యుమరేటర్లు అవసరమున్నారు. కేవలం పది ఉత్తీర్ణతతో బేసిక్ స్మార్ట్ ఫోన్ పరిజ్ఞానం గలవారు... ఈ భారీ అవకాశాల్లో ఉపాధి పొందేందుకు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సర్వే కోసం పరీక్ష రాయవలసి ఉంటుందని... ఉత్తీర్ణులకు తగు శిక్షణ, గుర్తింపు పత్రాలు ఇవ్వనున్నారు. అర్థ గణాంక సర్వేతోపాటు... రాబోయే కాలంలో ప్రతి సర్వేలో అవకాశం పొందే అవకాశం ఉందని డిజిథాన్ హైదరాబాద్ మేనేజర్ సౌమ్య తెలిపారు.
కేంద్రం చేపడుతున్న ప్రతిష్టాత్మక సర్వేలో సీఎస్‌సీతో కలిసి పనిచేయడం గర్వకారణంగా ఉందని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలా అన్నారు. డిజిథాన్ ద్వారా సాంకేతిక విద్యను అందించి దానికి కొనసాగింపుగా ఈ సర్వేలో యువతకు అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. ఆసక్తి గలవారు ఎన్యుమరేటర్లుగా నమోదు చేసుకొని ప్రస్తుత సర్వేతో పాటు భవిష్యత్ సర్వేలలోనూ అవకాశాలు పొందాలని సూచించారు.
ఇదీ చూడండి: చర్ల ఎదురు కాల్పులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్