తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి షురూ అయింది. ఆడబిడ్డలంతా తమ పుట్టిళ్లకు చేరుకుని తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబురాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆడపడచుల రాకతో ప్రతి ఇంటా కోలాహలం మొదలైంది. చదువు పేరిట ఇంటికి దూరంగా వెళ్లిన వాళ్లంతా తమ ఊళ్లకు చేరుకున్నారు. బంధువులు, స్నేహితులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి.
తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూలు(engili pula bathukamma). ఈ ఎంగిలి పూల బతుకమ్మ(engili pula bathukamma) మహాలయ అమావాస్య రోజున మొదలవుతుంది. దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు బతుకమ్మను స్వయంగా పేరుస్తుంది. వివిధ రకాల పూలతో.. భక్తిశ్రద్ధలతో.. పేరుస్తారు.
ఎంగిలిపూల బతుకమ్మ(engili pula bathukamma) అనే పేరు రావడానికి మూడు రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి.. బతుకమ్మను పేర్చేటప్పుడు ఆ పూలకాడలను చేతులతో సమానంగా చించి వేస్తారు. కత్తితో కోసినా.. నోటితో కొరికనా ఆ పూలు ఎంగిలి అయినట్లు భావిస్తారు. పూర్వకాలంలో కొందరు మహిళలు నోటితో కొరికి బతుకమ్మ పేర్చడం వల్ల అప్పటి నుంచి పెత్రామాస రోజు ఆడే బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు వచ్చినట్లు చెబుతున్నారు. మరోకథ ఏంటంటే.. మొదటి రోజున బతుకమ్మను పేర్చడానికి ముందు రోజు రాత్రే పువ్వులు తీసుకొని వస్తారని.. ఆ పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరువచ్చినట్లు ప్రతీతి. కొన్ని ప్రాంతాల్లో తిన్న తరువాత కూడా బతుకమ్మ పేరుస్తారని అందుకే ఆ పేరు వచ్చిందని చెబుతారు.
ఎంగిలిపూల(engili pula bathukamma) రోజున బతుకమ్మను పేర్చి.. సాయంత్రంపూట స్నేహితులు, బంధువులతో కలిసి ఆడబిడ్డలంతా ఎంతో సంబురంగా ఆడుకుంటారు. బతుకు దెరువు చెప్పే బతుకమ్మ పాటలన్నీ పాడుతూ ఆ పాటల వారసత్వాన్ని తర్వాత తరాలకు పంచుతుంటారు. ఈ పాటల్లో పంటలు సమృద్ధిగా పండాలని వరుణ దేవుణ్ని ప్రార్థిస్తారు. ప్రతి ఇంటా పాడిపంటలతో సుఖసంతోషాలు వెల్లివిరవాలని కోరుకుంటారు. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు, తండ్రీపిల్లు ఇలా అన్ని బంధాల విలువలు తెలిపే రకరకాల పాటలు పాడుతుంటారు. ఎంగిలిపూల రోజున నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఇలా తొమ్మిది రోజులు ఒక్కోరోజు ఒక్కో నైవేద్యాన్ని సమర్పిస్తారు.
చీకటి పడే వరకు మహిళలంతా బతుకమ్మ ఆడుకుని.. చీకటిపడుతోందనగా.. బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊళ్లో ఉన్న చెరువువైపు ఊరేగింపుగా బయల్దేరుతారు. పాటలు పాడుతూ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. తర్వాత ఇంటి నుంచి తీసుకొచ్చిన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పించి.. ఒకరికొకరు పంచిపెడతారు. బతుకమ్మ పేర్చిన ఖాళీ షిబ్బి, తాంబాలంతో పాటలు పాడుకుంటూ.. బతుకమ్మను గుర్తు తెచ్చుకుంటూ తిరిగి రేపు మళ్లీ వస్తామని చెబుతూ ఇళ్లకు చేరతారు.
తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో రకమైన పూలతో.. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు.
- ఎంగిలి పూల బతుకమ్మ(engili pula bathukamma) : మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
- అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
- ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
- నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
- అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
- అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
- వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
- వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
- సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.
- పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.
బతుకమ్మ సంబురాలంటే ఆడబిడ్డలతో పాటు చిన్నపిల్లలకు ఎంతో ఇష్టం. ఉదయాన్నే తమ తండ్రి, సోదరులతో వెళ్లి బతుకమ్మ పేర్చడానికి కావాల్సిన పూలు సేకరిస్తారు. తల్లి లేదా సోదరి బతుకమ్మను పేరుస్తుంటే ఆసక్తిగా చూస్తుంటారు. ఇంట్లో తమ అక్కాచెల్లెల్లు బతుకమ్మ పండుగ ఆడుకోవడానికి వెళ్తే వారితో పాటే ప్రతిరోజు వెళ్తారు. ఓ పక్కన వారు బతుకమ్మ ఆడుకుంటుంటే.. మరోపక్కన వీళ్లు కేరింతలు కొడుతుంటారు. చివర్లో నైవేద్యం పంచేటప్పుడు అందరు పరుగెత్తుకుంటూ వెళ్లి.. నాక్కావాలంటే నాకు కావాలని అల్లరి చేస్తుంటారు. తొమ్మిది రోజుల పాటు ఎంతో సందడి చేస్తారు.