శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మినహా మిగతా ఔట్ లెట్లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. కేఆర్ఎంబీ సమావేశం మినిట్స్ నేపథ్యంలో బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయమై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.
వ్యతిరేకిస్తోన్నా.. తప్పదు..
ఉపసంఘం నివేదిక, బోర్డు మినిట్స్ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని ఔట్ లెట్లను స్వాధీనం చేయాలంటున్నారని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. దీన్ని తెలంగాణ మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. జలవివాదాలను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఖరారు చేశాక... అన్ని ఔట్ లెట్లను స్వాధీనం చేస్తామని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. అప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్వాధీనం చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మినహా మిగతా ఔట్ లెట్లు బోర్డుకు అప్పగించవచ్చని ఈఎన్సీ అభిప్రాయపడ్డారు.
సిబ్బంది వివరాలు పరిశీలించండి..
కల్వకుర్తి ఎత్తిపోతల, సాగర్ స్పిల్‌వే, కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్లు, వరద కాల్వ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పంప్‌హౌస్‌లను బోర్డుకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. ఈ మేరకు ఆయా ఔట్ లెట్ల మానవ వనరులు, ప్రాంగణాలు, ప్లాంటులు, యంత్రాలను కృష్ణా బోర్డుకు స్వాధీనం చేసేందుకు వీలుగా సిబ్బంది వివరాలను మరోమారు పరిశీలించాలని నాగర్ కర్నూల్, నల్గొండ చీఫ్ ఇంజినీర్లను ఈఎన్సీ మురళీధర్ కోరారు.
ఏకీభవించని ఇరురాష్ట్రాలు..
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నేరుగా నీరు తీసుకునే అన్ని ఔట్లెట్లను అప్పగించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (krishna river management board) నిర్ణయించింది. గెజిట్ (KRMB MEETING ON GAZETTE)నోటిఫికేషన్ అమలుపై జరిగిన బోర్డు ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకోకుంటే ఫలితం లేదని ఆంధ్రప్రదేశ్ అభిప్రాయపడింది. ఈ వాదనతో విభేదించిన తెలంగాణ... కృష్ణాలో నీటివాటా కేటాయించే వరకు నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని కోరింది.
ఉత్తర్వులిచ్చేందుకు కసరత్తు..
ఇదిలా ఉండగానే.. కృష్ణా, గోదావరి నదులపై గుర్తించిన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్(KRMB and GRMB Gazette Implementation) నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే రెండు బోర్డులు ఇరు రాష్ట్రాల అధికారులతో పలుమార్లు సమావేశమయ్యాయి. మొత్తం 15 అవుట్లెట్లకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. కేఆర్ఎంబీ ప్రకటించిన 15 అవుట్లెట్లలో శ్రీశైలం పరిధిలో 6.. సాగర్ కింద 9 అవుట్లెట్లు ఉన్నాయి. విద్యుత్ కేంద్రాలు మినహాయించి ఉత్తర్వులిచ్చేందుకు తెలంగాణ యత్నిస్తుండగా.. ఉత్తర్వుల జారీపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది.
ఇదీ చూడండి: