కొవిడ్ రోగులకు చికిత్స కోసం అవసరమైన ఆక్సిజన్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అధికారులు... రైల్వే ద్వారా ట్యాంకర్లను ఒడిశాకు పంపారు. సికింద్రాబాద్ నుంచి ఐదు ఖాళీ ట్యాంకర్లను రైల్వే మార్గం ద్వారా పంపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జెండా ఊపి ట్యాంకర్లను ఒడిశాకు పంపించారు. ఇది మంచి ఫలితాన్ని ఇస్తే రోజు ఆరు నుంచి పది ట్యాంకర్ల వరకు పంపవచ్చని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.
ఇప్పటి వరకు యుద్ధవిమానాల ద్వారా ఖాళీ ట్యాంకర్లను పంపగా... ఆక్సిజన్‌తో రహదారి మార్గాన ట్యాంకర్లు వచ్చేవి. ఇందుకోసం నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతోంది. అయితే రైల్వే మార్గం ద్వారానే ట్యాంకర్లను పంపి... తిరిగి రైల్వే ద్వారానే తీసుకురావడం ద్వారా రెండున్నర రోజుల్లోనే తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.