విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ కోసం రూపొందించిన స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్‌ను కేంద్ర ప్రభుత్వ ఉపసంహరించుకోవాలని విద్యుత్ సంఘాల ఐకాస డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా.... హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగులు విధులు బహిష్కరించి... నిరసన వ్యక్తం చేశారు. మింట్ కాపౌండ్‌లోని విద్యుత్ సంస్థ టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తే... సంస్థలోని ఉద్యోగులతో పాటు వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. విద్యుత్‌పైనే ఆధారపడిన వ్యవసాయరంగం అంధకారంలోకి నెట్టబడుతుందని వాపోయారు.
కేంద్రం తీరును నిరసిస్తూ... జిల్లాల్లోనూ ఉద్యోగులు, కార్మికులు విధులకు వెళ్లకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్‌లో విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు విధులు బహిష్కరించి.... చెల్పుర్ కేటీపీపీ ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా విద్యుత్ కార్మికుల నుంచి ఉన్నతాధికారుల వరకు విధులను బహిష్కరించి... సమ్మెలో పాల్గొన్నారు. జగిత్యాలలో విద్యుత్ ఐకాస ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. నిర్మల్ విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు బైఠాయించి... నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని.... ఉద్యోగుల కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి... పాత విధానాన్నే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
నాగార్జునసాగర్ జెన్-కో కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో నిరసనకి దిగారు. మహబూబ్ నగర్ విద్యుత్ భవన్ ముందు ఉద్యోగులు, కార్మికులు బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా కేంద్రం వ్యవహరిస్తే... దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని విద్యుత్ ఉద్యోగ ఐకాస నేతలు హెచ్చరించారు.