మినీ పురపోరు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలు, ఐదు పురపాలికలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని కాంగ్రెస్, భాజపాలు కోరుతున్నాయి. హైకోర్టు కూడా ఈ వినతిని పరిశీలించాలని ఎస్ఈసీకి సూచించింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని.. ఎన్నికల సంఘం కోరింది. అయితే సర్కార్ నుంచి ఎస్ఈసీకి ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
నామినేషన్ల ఉపసంహరణ గడువు రేపటితో ముగియనుంది. ప్రచారానికి ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంత దూరం వచ్చాక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న భావనతోనే ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం తరహాలో ప్రచార సమయాన్ని పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి 72 గంటల ముందుకు కుదించే వెసులుబాటు కూడా ఎస్ఈసీకి ఉందని అంటున్నారు. రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో అందుకు అనుగుణంగా బహిరంగ సభలు, ర్యాలీల సమయాన్ని ఇప్పటికే కుదించారు.