విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రత్యామ్నాయంగా చేపట్టిన డిజిటల్ తరగతులకు విశేష స్పందన లభించిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుతం విద్యా సంస్థలను తెరవలేని పరిస్థితులు నెలకొనడం వల్ల తాత్కాలికంగా పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. మొదటి రోజున 85.42 శాతం మంది పాఠశాల స్థాయి విద్యార్థులు వివిధ మార్గాల ద్వారా డిజిటల్ తరగతులు వీక్షించినట్టు తేలిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిస్థితులు సమీక్షించారని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి పదో తరగతి వరకు 16 లక్షల 43 వేల 309 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి వివరించారు. వీరిలో మంగళవారం నాడు 14 లక్షల 3 వేల 826 మంది విద్యార్థులు డిజిటల్ తరగతులు వీక్షించారని వెల్లడించారు. దూరదర్శన్, టీ-సాట్ ద్వారా 10 లక్షల 72 వేల 851 మంది, స్మార్ట్ ఫోన్, లాప్టాప్, కంప్యూటర్ ద్వారా... 1 లక్షల 91 వేల 768 మంది విద్యార్థులు డిజిటల్ తరగతులను వీక్షించినట్టు మంత్రి వివరించారు. పంచాయతీ, గ్రంధాలయాల్లో 78 వేల 696 మంది విద్యార్థులు, టీఎస్ యాప్ ద్వారా లక్ష 56 వేల 688 మంది విద్యార్థులు చూసినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధ్యాయులు స్థానికంగా ఉన్న విద్యార్థులను కలిసి డిజిటల్ తరగతుల విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 42 వేల 979 మంది విద్యార్థులు వర్క్ షీట్లను కూడా పరిశీలించినట్లు మంత్రి వివరించారు.