Entrance exams Dates: ఇంటర్ ఎంపీసీ, బైపీసీ పరీక్షలు మే 7వ తేదీతో ముగుస్తాయి. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల చివరి సెమిస్టర్ పరీక్షలు జూన్ మొదటి వారానికి పూర్తవుతాయి. ఈక్రమంలో ఎంసెట్, ఈసెట్‌లను జూన్ నెలాఖరులో జరపాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మిగిలిన ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, పీజీ ఇంజినీరింగ్ సెట్‌లను జులైలో చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. డిగ్రీ విద్యార్హత కలిగిన వారే ఈ అయిదు ప్రవేశ పరీక్షలకు (లాసెట్‌లో అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీకి ఇంటర్‌వారు అర్హులు) హాజరవుతారు. వారికి చివరి సెమిస్టర్ పరీక్షలు జూన్ నెలాఖరు వరకు జరుగుతాయి. తర్వాత వారం, పది రోజుల సమయం ఇచ్చి జులైలో ప్రవేశ పరీక్షలను జరపాలని ఉన్నత మండలి నిర్ణయించింది. సెమిస్టర్ పరీక్షలకు ముందు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే దృష్టి కేంద్రీకరించలేరని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి చెప్పారు.
రేపటి నుంచి కమిటీ సమావేశాలు
ఈ నెల 7వ తేదీన ఎంసెట్, ఈసెట్, ఐసెట్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. పీజీఈసెట్, లాసెట్ భేటీలు 9న, ఎడ్‌సెట్ కమిటీ సమావేశం 10న నిర్వహిస్తారు. పీఈసెట్(వ్యాయామ విద్య) భేటీని 11న జరపాలని భావిస్తున్నారు. ఆయా ప్రవేశ పరీక్షల తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. కమిటీ సమావేశాల్లో సిలబస్, విద్యార్హత పరీక్షల్లో ఉత్తీర్ణత శాతంపై మినహాయింపు (పాసైతే చాలు) తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు ఈసారి కూడా 25% వెయిటేజి ఉండదు. ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులు ప్రకటిస్తారు.
ఇదీ చూడండి: