తెలంగాణలో రిటైల్ వర్తకం లాభాల బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలోనే బహుళజాతి సంస్థలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా సంస్థలకు అనుమతుల విషయంలో చురుగ్గా వ్యవహరిస్తోంది. భూ కేటాయింపులు, మౌలిక వసతులను కూడా సంస్థను నెలకొల్పడానికి కల్పిస్తోంది. పారిశ్రామిక విధానం కింద రాయితీలను కల్పించడం సైతం ఆ సంస్థలకు ఆకర్షణీయంగా మారింది. ఇ-కామర్స్, ఇతర వస్తు విక్రయ సంస్థలు ఇక్కడ తమ వ్యాపారాలను ప్రారంభిస్తున్నాయి. తాజాగా మరికొన్ని సంస్థలు కొత్త దుకాణాలను ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నాయి.
అమెజాన్ సంస్థ గచ్చిబౌలిలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద పంపిణీ కేంద్రం (డెలివరీ సెంటర్)ను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 90 కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటికి వస్తువులను సరఫరా చేస్తోంది. వీటిలో హైదరాబాద్‌లోనే 12 కేంద్రాలున్నాయి. వీటితో పాటు 3.2 మిలియన్ ఘనపుటడుగులు నిల్వ సౌకర్యం గల మరో మూడు పరిపూర్ణ (ఫుల్‌ఫిల్‌మెంట్) కేంద్రాలు, పటాన్‌చెరు వద్ద భారీ సమస్త వస్తు సేకరణ కేంద్రం నిర్మించింది. రాష్ట్రంలోని 2,500 కిరాణా షాపులతో అమెజాన్ ఒప్పందం చేసుకొని వ్యాపారం నిర్వహిస్తోంది. 500 ప్రాంతాలకు వస్తు పంపిణీ సాగిస్తోంది.
- వన్‌ప్లస్ సంస్థ హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఆర్థిక జిల్లాలో 1.86 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల 5 నిల్వ కేంద్రాలను (స్టోర్లు) నిర్వహిస్తోంది. దీని ద్వారా 1500 మంది నిపుణులకు ఉపాధి అందిస్తోంది. త్వరలోనే భారీ అనుభవ (ఎక్స్‌పీరియన్స్) కేంద్రం ఏర్పాటు చేయనుంది.
- వాల్‌మార్ట్ హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌లో దుకాణాలను ఏర్పాటు చేసింది. మరిన్ని కేంద్రాల అన్వేషణలో ఉంది.
- క్వికర్ బజార్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కేంద్రం విజయవంతం కావడంతో నిజామాబాద్, నల్గొండ, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెం తదితర జిల్లా కేంద్రాల్లో 8 దుకాణాలను ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉంది.
- క్యుమార్ట్ సంస్థ హైదరాబాద్ గచ్చిబౌలిలో రెండు కేంద్రాలను నిర్వహిస్తోంది. మరో రూ. 20 కోట్ల పెట్టుబడితో కోకాపేట, కొంపల్లితో పాటు మరోచోట మొత్తం 3 కేంద్రాల స్థాపనకు నిర్ణయించింది.
- ఫ్లిప్‌కార్ట్ హైదరాబాద్‌లో భారీ డాటా కేంద్రం ఏర్పాటు చేసింది. విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
- వండర్‌చెఫ్ సంస్థ తెలంగాణలో 5 దుకాణాలను నిర్వహిస్తోంది. త్వరలోనే మరో కేంద్రాన్ని ప్రారంభించనుంది.
- టైటాన్ సంస్థ హస్తకళా చీరలను విక్రయించేందుకు తనేరియా పేరిట దుకాణాన్ని ఇటీవలే ప్రారంభించింది.
- డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఫర్నిచర్, విద్యుత్ ఉపకరణాల సంస్థ జోకాన్సెప్ట్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో బోకాన్సెప్ట్ పేరుతో దుకాణాన్ని ప్రారంభించింది. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇది నడుస్తోంది.
- స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఫర్నిచర్, గృహోపకరాల సంస్థ ఐకియా హైదరాబాద్‌లో ఇప్పటికే తమ కేంద్రాన్ని నిర్వహిస్తోంది.
ఇవీ చూడండి: అసలేం జరుగుతోంది: కరోనా టెస్టుల్లో రోజుకో ఫలితం.. బాధితుల్లో అయోమయం!