కరోనా కల్లోల ప్రభావం పొదుపు సంఘాలపైనా పడింది. లాక్‌డౌన్ నిబంధనలతో ఏప్రిల్, మే లో చిరువ్యాపారాలు జరగక, పనులు దొరక్క ఆదాయం మందగించింది. రుణ కిస్తీలు చెల్లించేందుకు డ్వాక్రా సంఘాల మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు కిస్తీ కట్టడం ఆపేస్తే.. ఎక్కువ మంది చేతిలో సొమ్ములేకపోయినా వడ్డీరాయితీ పోతుందన్న భయంతో అప్పుచేసో, ఆసరా పింఛను సొమ్ముతోనో, ఇతరత్రా అవసరాల్ని పక్కనపెట్టి అతికష్టంగా చెల్లిస్తున్నారు. మరోవైపు వ్యక్తిగతంగా ప్రతినెలా చేసుకునే పొదుపుపై కూడా ప్రభావం పడింది. కరోనా మరికొంత కాలం ఉండే అవకాశం ఉండటంతో రుణకిస్తీలు ఎలా చెల్లించాలన్న ఆందోళన వారిలో ఉంది. రెండు దశాబ్దాలుగా ఆర్థికక్రమశిక్షణ పాటిస్తున్న తమకు కొవిడ్ నేపథ్యంలో ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు.
ఓ సంఘంలో కొందరు కిస్తీ కట్టి, మరికొందరు కట్టకపోయినా అందరికీ రాయితీ వర్తింపజేయాలని డ్వాక్రా మహిళలు విజ్ఞప్తిచేస్తున్నారు. బ్యాంకులు, సెర్ప్ నిధులు, స్త్రీ నిధి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రుణాలందుతున్నాయి. వచ్చిన మొత్తాన్ని సభ్యులు పంచుకుని..కూరగాయల దుకాణం, టైలరింగ్, పేపర్‌ప్లేట్లు, జనపనార సంచుల తయారీ, చిన్నచిన్న దుకాణాల నిర్వహణకు వాడుకుంటున్నారు. తీసుకున్న రుణాన్ని బట్టి ఒక్కో మహిళ నెలకు వెయ్యి నుంచి రూ.ఐదు వేలు, ఆపైన కట్టాల్సిన పరిస్థితి. కొవిడ్ నేపథ్యంలో రుణవాయిదా చెల్లింపులపై ఆరునెలల పాటు మారటోరియం ప్రకటించినప్పటికీ వాయిదాలు పెరుగుతాయని, వడ్డీ రాయితీ పోతుందన్న కారణంతో ఇబ్బంది పడి కిస్తీలు కడుతున్నట్లు మహబూబాబాద్ జిల్లా అబ్బాయిపాలెం, తాళ్లఊకల్ గ్రామాలకు చెందిన మహిళలు చెప్పారు. కరోనా నేపథ్యంలో కేంద్రం రుణాలు ఇస్తుండటంతో డ్వాక్రా మహిళల్లో కొంత మందికి కాస్త ఉపశమనం కలుగుతోంది. ఒక్కో సభ్యురాలికి రూ.5 వేల చొప్పున బ్యాంకులిస్తున్నాయి. కొన్నిచోట్ల ఈ రుణాలూ అందడం లేదని మహిళా సంఘాలు చెబుతున్నాయి.
కరోనా తర్వాత కూడా రుణాలు
గత ఆర్థిక సంవత్సరం రుణ వాయిదాల రికవరీ 90 శాతం వరకు ఉండటంతో కరోనా తర్వాత కూడా ఆరు లక్షల మంది మహిళలకు రూ.800 కోట్లు, స్త్రీనిధి కింద 1.50 లక్షల మందికి రూ.150 కోట్ల రుణాలిచ్చాం. ధాన్యం కొనుగోళ్లతో పాటు 50 వేల మందికి మాస్క్‌ల తయారీలో ఉపాధి కల్పించాం. -వై.నర్సింహారెడ్డి ‘సెర్ప్’డైరెక్టర్ (బ్యాంకు రుణాల విభాగం)
పొదుపు ఆగిపోయింది
గతంలో ప్రతినెలా బ్యాంకులో కనీసం రూ.500 పొదుపుచేశా. 3 నెలల నుంచి ఆపేశా. కిరాణా వ్యాపారం మందగించింది. తీసుకున్న రుణం కిస్తీ అతికష్టమ్మీద చెల్లించా:- మద్దోజు కోటేశ్వరి, అబ్బాయిపాలెం, మహబూబాబాద్ జిల్లా
పెట్టుబడి లేక రెండు నెలలు ఇబ్బంది
కూరగాయల విక్రయమే నాకు జీవనోపాధి. పెట్టుబడి లేక రెండు నెలలు ఇంట్లో ఖాళీగా ఉన్నా. ఆర్థికంగా ఇబ్బందిపడ్డా. కొవిడ్-19 రుణం రూ.5 వేలు రావడంతో కొంచెం ఉపశమనం లభించింది. కూరగాయలు కొని దుకాణం తెరిచా:- -వంగపెల్లి రాజేశ్వరి, పరకాల