డ్రోన్లను కూల్చే సాంకేతికత అభివృద్ధిపై డీఆర్‌డీవో చేస్తున్న పరిశోధనలు ఏ దశలో ఉన్నాయి?
అత్యాధునిక యాంటీ డ్రోన్(Drones) వ్యవస్థను డీఆర్‌డీవో విజయవంతంగా అభివృద్ధి చేసింది. చిన్న, మైక్రో డ్రోన్లను సైతం రాడార్ సాయంతో గుర్తించే సమగ్ర వ్యవస్థ ఇది. ఎలక్ట్రో-ఆప్టికల్ (ఈవో)/ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) సెన్సర్ల ఆధారంగా గుర్తించి ట్రాక్ చేస్తుంది. సాఫ్ట్‌కిల్ వ్యవస్థ రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్‌ఎఫ్)/గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) సిగ్నళ్లను స్తంభింపజేస్తుంది. ఇందులోనే ఉండే హార్డ్‌కిల్ వ్యవస్థ లేజర్ టెక్నాలజీతో డ్రోన్లను నిర్వీర్యం చేస్తుంది. ఈ వ్యవస్థలన్నీ కమాండ్ పోస్ట్‌తో అనుసంధానించి ఉంటాయి.
డ్రోన్లను కూల్చే వ్యవస్థ ఎంత పరిధిలో పనిచేస్తుంది?
360 డిగ్రీల కోణంలో లక్ష్యాలను గుర్తించేందుకు తగ్గట్టుగా ఈ వ్యవస్థ రాడార్‌ను కలిగి ఉంటుంది. 4 కి.మీ. వరకు మైక్రో డ్రోన్ల(Drones)ను గుర్తించగలదు. ఎలక్ట్రో-ఆప్టిక్/ఇన్‌ఫ్రారెడ్‌తో ఎంచుకున్న దిశలో 2 కి.మీ. వరకు చిన్న, సూక్ష్మ డ్రోన్లను గుర్తించగలదు. సాఫ్ట్‌కిల్ వ్యవస్థ 3 కి.మీ. పరిధిని లక్ష్యంగా చేసుకొని ఆర్‌ఎఫ్/జీఎన్‌ఎస్‌ఎస్ రెండింటి సిగ్నల్స్‌ను జామ్ చేయొచ్చు. అధిక శక్తి కలిగిన ఫైబర్ లేజర్‌తో లక్ష్యాన్ని గుర్తించి ధ్వంసం చేస్తుంది. 150 మీటర్ల నుంచి కి.మీ. వరకు ఇది పనిచేస్తుంది.
ఈ సాంకేతికత భారత సైన్యానికి ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది?
డ్రోన్ల(Drones)ను కూల్చే లేజర్, జామింగ్ వ్యవస్థలతో పాటు కిల్లర్ డ్రోన్, డ్రోన్ల సమూహం వంటి ఇతర సాంకేతికత పరిష్కారాలను యువ శాస్త్రవేత్తలతో కూడిన రెండు ప్రయోగశాలలు అభివృద్ధి చేస్తున్నాయి. యాంటీ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే రక్షణ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్- బెల్(బీఈఎల్)కు బదిలీ చేశాం. భారత సాయుధ దళాలు వారికి ఆర్డర్లు ఇవ్వొచ్చు.
ఇజ్రాయెల్ నుంచి భారత సైన్యం దిగుమతి చేసుకునే ఆలోచన చేస్తోంది? ఆ దేశంతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం?
దాడులను ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతికతల అభివృద్ధికి ఏ దేశానికి తీసిపోని విధంగా డీఆర్‌డీవో నిరంతరం కృషి చేస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే.. పరిస్థితులకు తగ్గట్టుగా ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోలేం.