Anantapur JNTU 75th Anniversary: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీయూలో చదువుకున్న వారిలో అనేక మంది ఉన్నత పదవుల్లో ఉన్నారని డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. జేఎన్టీయూ 75 సంవత్సరాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతపురం జేఎన్టీయూలో చదివిన తనకు.. ప్రాంగణంలో ఉన్న ప్రతి చెట్టూ, రాయితో అనుబంధం ఉందని అన్నారు. ఇక్కడి స్థలం చాలా గొప్పదని కొనియాడారు.
కోర్సులు ప్రారంభిస్తే నిధులిస్తాం..
DRDO Chairman On Anantapur JNTU: దేశవ్యాప్తంగా 300 కళాశాలలకు డీఆర్డీవో నుంచి విద్యార్థుల కోసం రూ.వెయ్యి కోట్లు ఇచ్చినట్లు సతీశ్ రెడ్డి వెల్లడించారు. అనంతపురం జేఎన్టీయూలో డిఫెన్స్ టెక్నాలజీ కోర్సులు ప్రారంభిస్తే.. నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు కూడా డిఫెన్స్ సంస్థల్లో ఇంటర్న్షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు. డీఆర్డీఓలో కొత్తగా ఆర్టిలరీ గన్ ఉత్పత్తి చేసినట్లు చెప్పారు.
వాటికే మనుగడ - రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్
రాబోయే రోజుల్లో నాణ్యమైన చదువు అందించే సంస్థలకే మనుగడ ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా విద్యాసంస్థలు మార్పులు చేసుకుంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధ్యమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: TS Inter results: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై బోర్డు వివరణ ఇలా..!