Dollar Seshadri Funeral: తిరుపతి వైకుంఠ ప్రస్థానంలో డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు ముగిశాయి. శేషాద్రి సోదరుడు రామానుజం తలకొరివి పెట్టారు. అంతకుముందు డాలర్ శేషాద్రి నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో.. వైకాపా ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం సహా... తితిదే సభ్యులు పాల్గొన్నారు. చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి పాడే మోశారు. వైకుంఠ ప్రస్థానంలోనూ పలువురు శేషాద్రి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. డాలర్ శేషాద్రి సోదరుడు రామానుజం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నివాళి..
అంతకు ముందు డాలర్ శేషాద్రి భౌతికకాయానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులర్పించారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 25 ఏళ్లుగా శేషాద్రితో అనుబంధం ఉందన్న జస్టిస్ ఎన్వీ రమణ.. డాలర్ శేషాద్రి లేని తిరుమలను ఊహించలేకపోతున్నానన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన సంప్రదాయాలను డాలర్ శేషాద్రి పుస్తకరూపంలో తెచ్చారని.. భావితరాలకు అవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. శేషాద్రి రచించిన పుస్తకాలను తితిదే వినియోగించుకోవాలని సూచించారు. శ్రీవారి సేవలోనే తుదిశ్వాస వీడవటం శేషాద్రి అదృష్టమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
గుండెపోటుతో మృతి..
తితిదే నిర్వహిస్తున్న కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన ఆయనకు సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. హుటాహుటిన రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. 1978 నుంచి శ్రీవారి సేవలో శేషాద్రి తరించారు. 2007లో పదవీ విరమణ చేసినప్పటికీ.. ఆయన సేవలను గుర్తించిన తితిదే ఓఎస్డీగా కొనసాగిస్తూ వస్తోంది. మరణించే చివరి క్షణం వరకు స్వామివారి సేవలో శేషాద్రి తరించారు.
ఇదీ చదవండి: Pala Seshadri as Dollar Seshadri : పాల శేషాద్రి..'డాలర్ శేషాద్రి'గా ఎలా మారారో తెలుసా?