ఏపీలోని చిత్తూరు జిల్లా నారావారిపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్య అధికారి కళ్యాణ్ చక్రవర్తి నిర్లక్ష్యం వీడటం లేదు. ఇటీవల స్వాబ్ పరీక్షలను నిర్వహించి, పీపీఈ కిట్లను ఆసుపత్రి ఆవరణలోనే పడేసిన విషయం మరువకముందే మరోసారి అతని నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. మరో నెల రోజుల్లో ప్రసవం కానున్న గర్భిణుకు 20 రోజుల్లో కాలం చెల్లనున్న మాత్రలను అందజేశారు.
చంద్రగిరి మండల పరిధిలోని నారావారిపల్లిలో సోమవారం గర్భిణులకు పరీక్షలను నిర్వహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాలలోని ఏడుగురు గర్భిణులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో పరీక్షల అనంతరం వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రి సిబ్బంది బీ కాంప్లెక్స్, ఐరన్ మాత్రలు అందజేశారు. మరో 20 రోజుల్లో మాత్రలు కాలం చెల్లనున్నాయి. అయినా కూడా ఒక్కో మహిళకు 60 మాత్రలు చొప్పున అందించారు. ఆసుపత్రి వెలుపలకు వచ్చి మాత్రలను పరిశీలించిన మహిళలు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఆసుపత్రి సిబ్బంది అందజేసిన మాత్రలు కాలం చెల్లినవిగా గుర్తించకుంటే పెను ప్రమాదం వాటిల్లేదని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల సూచనల మేరకు మందులను ఉపయోగించి ఉంటే మా పరిస్థితి ఏమిటంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
గర్భిణులకు వారం వారం నిర్వహించే స్కానింగ్ పరీక్షలను వైద్యాధికారులు నామ మాత్రంగా చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రెవేటు ఆసుపత్రిలో స్కానింగ్ పరీక్ష చేయించుకునే స్తోమత లేకపోవడంతో ఇక్కడకు వస్తే అధికారులు ఏ మాత్రం పరీక్షలను నిర్వహించకుండా, నామమాత్రంగా చూసి పంపిస్తున్నారని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులకు వైద్య అధికారి కళ్యాణ్ చక్రవర్తి హాస్పిటల్ లో ఎప్పుడూ అందుబాటులో ఉండడని రోగులు ఆవేదన వెలిబుచ్చారు.
ఇదీ చూడండి. 'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ