ప్రపంచ ప్రఖ్యాత రామోజీఫిల్మ్ సిటీని చూసి సందర్శకులు మైమరిచిపోయారు. సుందర కట్టడాలు, అద్భుత దృశ్యాల నడుమ వినోదాల విందును మోసుకొస్తూ... దీపావళి కార్నివాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. కొవిడ్ ప్రత్యేక మార్గదర్శకాలను అమలుచేస్తూ పర్యాటకుల భద్రతపై చిత్రనగరి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఆనంద లోకాల్లో సందర్శకులు..
సాయంసంధ్యవేళ మదిని ఉల్లాసపరిచే సాంస్కృతిక కార్యక్రమాల సందడిలో పర్యాటకులు తడిసి ముద్దయ్యారు. నృత్య బృందాలు పంచే వినోదానికి తోడు వీనుల విందైన సంగీతాన్ని ఆస్వాదించారు. విద్యుద్దీపాలంకరణలోని గార్డెన్ల అందాలు వీక్షిస్తూ ఆనందలోకాల్లో విహరించారు.
అందమైన ప్రపంచం.. రామోజీ ప్రాంగణం..
ఫిల్మ్‌సిటీలోని ప్లే జోన్లు, వివిధ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలను చూసి ఫిదా అయిపోయారు. రామోజీ ఫిల్మ్‌సిటీ అందమైన ప్రపంచాన్ని తలపిస్తోందంటూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఆర్ఎఫ్సీలో దీపావళి కార్నివాల్..
వచ్చిన ప్రతీసారి ఫిల్మ్‌సిటీలో మరెన్నో చూడదగ్గ ప్రదేశాలతో పాటు కొత్త వినోద కార్యక్రమాలు అలరిస్తున్నాయని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు . రోజంతా తిరిగినా తనివి తీరలేదంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సందర్శకులను కనువిందు చేసే దీపావళి కార్నివాల్ సంబురాలు ఈనెల 14 వరకు సాగనున్నాయి.