షాద్‌నగర్ చటాన్‌పల్లి ఎదురు కాల్పుల ఘటనపై విచారణ హైకోర్టు ఆవరణలోనే జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితులు గత డిసెంబరు 6న జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ దాఖలైన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలోని కమిషన్ విచారణ ప్రారంభించిన ఆరు నెలల్లోపు ముగించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది.
విచారణకు సంబంధించి విధి విధానాలను రెండు రోజుల క్రితం విడుదల చేసింది. సభ్యులకు బస కల్పించడంతో పాటు విచారణ సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వమే చేయాల్సి ఉంది. కమిషన్ సభ్యులు తమ విచారణకు అవసరమైన ఏర్పాట్లపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత కమిషన్ హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం.
ఇవీ చూడండి: పంటకు ధర కరవు... ఆవేదనలో కందిరైతు