కరోనా కారణంగా వేలాది మంది విద్యార్థులు బడికి దూరమయ్యారు. ఆర్థిక సమస్యలతో ఆన్‌లైన్ తరగతులకూ నోచుకోలేకపోయారు. పేద పిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొంతమంది ప్రభుత్వ టీచర్లు కలిసి.. డిజిటల్ క్లాసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా బోధనా వెబ్‌సైట్‌లని రూపొందించి.. విద్యార్థుల చదువుకు కృషి చేశారు. ఆ మేరకు నేడు ఎంతో మంది విద్యార్థులు పాఠాలు చదవగలుగుతున్నారు. పదో తరగతి పరీక్షలకీ ధీమాగా సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దక్షిణాదిలోనే ఇదో.. అపూర్వ ప్రయోగంగా పేర్కొంటున్నారు విశ్లేషకులు. అతి తక్కువ వనరులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు సాధించిన ఈ అద్భుతంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
'మరో పదినెలల్లో రిటైర్ అవుతాను.. నాకెందుకీ టెక్నికల్ తలనొప్పులూ అనుకుని మొదట్లో చిరాకుపడ్డ మాట వాస్తవం. కానీ పాఠాలని వీడియోలో రికార్డు చేయడం, వాటిని అప్‌లోడ్ చేయడం వంటివి నేర్చుకునే కొద్దీ కొత్త ఉత్సాహం వచ్చింది. అన్నింటికన్నా పేద విద్యార్థులకి నా బోధన ఉపయోగపడుతుందనే ఆలోచన నా శ్రమని మరిపించింది!' అని చెబుతారు యరబర్ల శ్రీధర్. హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ బడిలో సైన్స్ టీచర్‌గా ఉంటున్న ఆయన వచ్చే జూన్‌లో ఉద్యోగ విరమణ చేస్తారు. అయితేనేం.. ప్రతివారం తన సైన్స్ పాఠాలని హైదరాబాద్ డిజిటల్ లైబ్రరీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. శ్రీధర్ లాంటి 163 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి వల్ల.. నేడు వేలాది మంది, బడికి వెళ్లకపోయినా.. పాఠాలు చదవగలుగుతున్నారు.
రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలు... వేర్వేరుగా వెబ్‌సైట్‌లని రూపొందించుకుని విద్యార్థులకి డిజిటల్ పాఠాలు చెబుతున్నాయి. ఇవి ఆన్‌లైన్ క్లాసులు కావు. వాటికైతే నిర్దేశించిన సమయంలో ఇంటర్నెట్ సౌకర్యం ఉండి తీరాలి. గ్రామాల్లోనో, నగరంలోని మురికివాడల్లోనో ఉండే విద్యార్థులకి అది సాధ్యం కాదు. అందుకే నెట్ కనెక్టివిటీ పెద్దగా అవసరం లేని 'డిజిటల్ లైబ్రరీ'లని ఈ జిల్లాలు సృష్టించాయి. ఆయా జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయులు తమ పాఠాలను వీడియోలుగా తయారుచేసి ఇందులో పెడుతున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులకి బేసిక్ స్థాయి స్మార్ట్‌ఫోన్ ఉన్నా, రోజులో నిమిషం పాటు ఇంటర్నెట్ కనెక్షన్ దొరికినా చాలు... ఈ వీడియోలని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వేగంగా సులభంగా డౌన్‌లోడ్ అయ్యేలా ప్రతి పాఠాన్నీ నాలుగైదు విభాగాలుగా చేసి.. ప్రతి భాగాన్నీ పది నిమిషాల వీడియోలుగా మలిచారు. మూడు నుంచి పదో తరగతి దాకా దాదాపు అన్ని సబ్జెక్టుల్నీ ఇలా వీడియోలుగా రూపొందించారు. అలా ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మాధ్యమాలకి కలిపి 1900 వీడియోలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడులు, సొంతంగా వెబ్‌సైట్ లేని ప్రైవేటు స్కూళ్లూ వీటిని వాడుకుంటున్నాయి. అందుకే ఈ సైట్‌లకి సుమారు 15 లక్షల దాకా వీక్షణలున్నాయి!
'మేడ్చల్ బడి' తో మొదలు..
కరోనా లాక్‌డౌన్‌తో గత మార్చిలో విద్యాబోధన అర్ధాంతరంగా ఆగిపోయింది. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకి ఏమీ పాలుపోని పరిస్థితి. వాళ్లని డిజిటల్ మాధ్యమాల ద్వారానైనా ఆదుకోవాలన్న డీఈఓ విజయకుమారి సూచనల మేరకు మేడ్చల్ జిల్లా సైన్స్ ఆఫీసర్, మచ్చబొల్లారం జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు కేశవరెడ్డి ఓ ప్రణాళిక రూపొందించారు. సహచర హెడ్మాస్టర్లు రవీందర్‌రాజు, వి.గోపాల్‌లతో కలిసి వాట్సాప్ ఆధారంగా పదో తరగతి విద్యార్థులకి పాఠాల పీడీఎఫ్‌లూ, వాటికి ఉపయోగపడే యూట్యూబ్ వీడియోల లింకుల్ని పంపించారు. కానీ ఆ పద్ధతి విజయం సాధించలేదు. యూట్యూబ్ లింకుల్ని చూడటానికి వెళ్లిన విద్యార్థులు ఇతర వీడియోలవైపు ఆకర్షితులవుతున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారట. దాంతో విద్యార్థులకి నేరుగా క్లాసుల్లో ఉన్న అనుభూతినే కలిగించేలా ప్రత్యేక వెబ్‌సైట్‌ని రూపొందించాలనుకున్నారు. దాని ఫలితమే మేడ్చల్ బడి smedchalbadi.com వెబ్‌సైట్.
ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే నాలుగున్నర లక్షలదాకా వీక్షణలు అందుకున్నాయి. దీనికి డిజైనర్‌గా ఉన్న ప్రధానోపాధ్యాయుడు వి.గోపాల్ రంగారెడ్డి విద్యాజిల్లా 'ఆర్‌ఆర్ బడి' (rrbadi.com) కూడా రూపొందించారు. మూడో తరగతి నుంచే పాఠాలు ఉండటం దీని ప్రత్యేకత. ఆ తర్వాత హైదరాబాద్ జిల్లా కూడా తమ వెబ్‌సైట్ (deohyd.telangana.gov.in)ని మొదలుపెట్టింది. ఇందులో తెలుగు, ఆంగ్లంతో పాటు ఉర్దూ మీడియం కూడా ఉండటం విశేషం.
ఎలా ఉన్నాయంటే..
మార్కెట్‌లో ఉన్న ఏ ప్రైవేటు బోధనా సైట్‌కీ తీసిపోని విధంగా ఈ వెబ్‌సైట్‌లని రూపొందించారు. నాణ్యమైన గ్రాఫిక్స్ కూడా వాడుతున్నారు. కొందరు టీచర్లు 'కైన్ మాస్టర్' వంటి అధునాతన ఆప్‌లతోనూ పాఠాలు రూపొందిస్తున్నారు. 'జియో జిబ్రా' వంటి ఆప్‌లతో గణితం పాఠాలను యానిమేషన్‌తో బోధిస్తున్నారు. యూట్యూబ్‌లో ఆంగ్లంలో ఉన్న పాఠాలని తెలుగులో 'డబ్' చేసి అందిస్తున్నవాళ్లూ ఉన్నారు.! విద్యార్థుల ప్రగతిని అంచనా వేసే వర్క్‌షీట్లూ ఇందులో ఉన్నాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దక్షిణాదిలోనే ఇదో అపూర్వ ప్రయోగం. అతి తక్కువ వనరులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు సాధించిన అద్భుతం.!